TranssTroy Scam loan default : నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను తలదన్నేలా ట్రాన్స్ ట్రాయ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. బ్యాంకులకు ట్రాన్స్ ట్రాయ్, కుచ్చుటోపీ పెట్టిన భారీ స్కామ్ బయటపడింది. వ్యాపారవేత్తలు రాయపాటి సాంబశివరావు, చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రాన్స్ ట్రాయ్ లిమిటెడ్ సంస్థ దాదాపు పదిహేను బ్యాంకుల నుంచి వేల కోట్లలో తీసుకున్న రుణాలు, ఆ రుణాలను దారి మళ్లించిన తీరు.. ఇందుకోసం సృష్టించిన బోగస్ సంస్థల సరళికి సంబంధించి రూ.9వేల కోట్ల స్కామ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాన్స్ ట్రాయ్, రాయపాటి అక్రమాలపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్టు వెల్లడించింది.
చెరకూరి శ్రీధర్, రాయపాటి సాంబశివరావు, అక్కినేని సతీష్, సూర్యదేవర శ్రీనివాస బాబ్జీ, రాయపాటి సాంబశివరావు భార్య లీలాకుమారి తదితరులు డైరెక్టర్లుగా వ్యవహరించిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ మొత్తం 15 బ్యాంకుల నుంచి రూ.7వేల 153 కోట్ల రుణంగా తీసుకుని.. ఇందులో రూ.6,202 కోట్లను వివిధ బోగస్ సంస్థలకు మళ్లీంచినట్టు సీబీఐ సంస్థ రెండు రోజుల క్రితం ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు,ఆఫీసుల్లో చేసిన దాడుల్లో వెల్లడైంది. ఈ మేరకు సీబీఐ కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది.సీబీఐ ఎఫ్ఐఆర్ లో నివ్వెరపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బ్యాంకుల నుంచి తీసుకున్న నిధుల మళ్లీంపు కోసం సృష్టించిన కొన్ని బోగస్ సంస్థల్లో భాగస్వాములుగా ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పెద్దలకు చెందిన డ్రైవర్లు, పనిమనిషులు, స్వీపర్లకు ఇవ్వడం విస్తుగొలుపోతోంది. ట్రాన్స్ ట్రాయ్ వివిధ బ్యాంకులతో జరుపుతోన్న రుణలావాదేవీల్లో ఎన్నో ఏళ్లుగా అక్రమాలు జరుగుతున్నప్పటికీ చాలాకాలం పాటు ఈ బ్యాంకుల నిద్రమత్తులో జోగుతున్నట్టు తెలుస్తోంది. 2001లో ఏర్పాటైన ట్రాన్స్ ట్రాయ్ సంస్థల ప్రాజెక్టులు, సివిల్ ఇంజినీరింగ్ పనులు, జాతీయ రహదారులు, బ్రిడ్జీల నిర్మాణాల వంటి కాంట్రాక్టుల పనుల్లో నిమగ్నమైంది.
ఒక దశలో పోలవరం ప్రాజెక్టు కూడా ట్రాన్స్ ట్రాయ్ కాంట్రాక్టరుగా వ్యవహరించింది. ట్రాన్స్ ట్రాయ్ చేతిలో మోసపోయిన బ్యాంకుల్లో కెనరా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుకో బ్యాంకు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ బ్యాంకు, దీనా బ్యాంకు, విజయా బ్యాంకులు ఉన్నాయి.
వీటిలో అత్యధికం ప్రభుత్వ రంగ బ్యాంకులే కావడం విశేషం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను వేల కోట్లలో ఒక సంస్థ బురిడీ కొట్టించిందంటే దీని వెనుక ఉన్న రాజకీయ నేతలు, అధికారుల ప్రమేయంపై అనుమానం రాక మానదు. ఈ బ్యాంకులన్నీ క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంకు గ్యారెంటీ, లెటర్ ఆఫ్ క్రెడిట్, ఇన్ ల్యాండ్ గ్యారెంటీ, ఫారెన్ ఎంటిటి రూపంలో ఈ బ్యాంకులకు ట్రాన్స్ ట్రాయ్ కు నైవేద్యం సమర్పించినట్టుగా తెలుస్తోంది.
ఇక దాదాపు 10ఏళ్లుగా నిర్వహిస్తున్న లావాదేవీల్లో పలు అక్రమాలతో పాటు ఈ సంస్థ చెల్లించాల్సిన రుణాలను 2015లోనే నిరర్ధక రుణాలగా పరిగణించనిప్పటికీ ఈ విషయాలన్నింటిని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు మాత్రం 2020 ఫిబ్రవరిలో మాత్రమే తెలియజేయడం కొసమెరుపు.. చేతులు కాలిన తర్వాత ఆకులు ముట్టుకున్నట్టు చందంగా తీసుకున్న రుణాలన్నింటికి ట్రాన్స్ ట్రాయ్ శతగోపం పెట్టిన తర్వాత 2020లో ఈ వ్యవహారం అంతటిని కెనరా బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేశారు. అప్పులు ఇచ్చిన బ్యాంకులకు కన్సార్టియంకు కెనరా బ్యాంకు లీడ్ గా వ్యవహరిస్తోంది.
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వివిధ రూపాల్లో దారిమళ్లించేందుకు ట్రాన్స్ ట్రాయ్ డైరెక్టర్లు సృష్టించిన బోగస్ సంస్థల్లో పద్మావతి ఎంటర్ ప్రైజేస్, యూనిక్ ఇంజినీర్స్, బాలాజీ ఎంటర్ ప్రైజేస్, రుత్విక్ అసొసియేట్స్, శుభాకరి ఎంటర్ ప్రైజేస్, అగస్త్య ట్రేడ్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఖండాల్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏ.ఎస్. అసోసియేట్స్, విజయ్ ఇంజినీరింగ్ ఎక్విప్ మెంట్స్ ఉన్నాయి. బ్యాంకులు ముంచిన డబ్బుల్లోనుంచి అక్షరాలా 350 కోట్ల రూపాయల ప్రమోటర్ల సొంత అకౌంట్లలోకి బదలాయించినట్టు కేపీఎంజీ ఆడిట్ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ అయింది. అంతేకాదు.. మరో 450 కోట్లు బోగస్ సంస్థల నుంచి కంపెనీ ప్రమోటర్లకు మళ్లించి అ డబ్బుతోనే షేర్ల అలాట్ మెంట్ కూడా జరిపించారు.
ఇక ట్రాన్స్ ట్రాయ్ మోసాల్లో 8 ఎక్స్ లేటర్లను కొని 24 కొన్నట్టుగా చూపించడం.. 5 టిప్పర్లు కొని 10 టిప్పర్లుగా చూపించడం.. ప్రాజెక్టు సైటులో లేని మెటేరియల్ ఉన్నట్టుగా 17వందల 53 కోట్ల రూపాయలుగా చూపించడం.. మరో 907 కోట్లను ఓవర్ వాల్యూ చేసి చూపించడం వంటి ఎన్నో వెలుగులోకి వచ్చాయి. రాయపాటి వాటాదారుగా ఉన్న శ్రీజయలక్ష్మి పవర్ కంపెనీ నుంచి రావాల్సిన 36.51 కోట్లను వచ్చే పనిలేకుండా సర్దుబాటు చేశారు.
2012 నుంచి 2018 వరకు ట్రాన్స్ ట్రాయ్ జరిపిన బ్యాంకు లావాదేవీలపై కేపీఎంజీ సంస్థ ఆడిట్ నిర్వహించడంతో ఈ అక్రమాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. జనవరి 2020లో దీనికి సంబంధించి ఆడిట్ నివేదికను సమర్పించింది. గుంటూరుకు చెందిన రాయపాటి సాంబశివరావు వ్యాపారవేత్తగానే కాకుండా కాంగ్రెస్, టీడీపీ పార్టీల్లో చురుకైన రాజకీయ నేతగా వ్యవహరిస్తూ పలు దఫాలుగా ఎంపీగా పనిచేశారు.