Chandrababu: ఈరోజు సంక్షేమ పథకాలు పొంది రేపు మాకు ఓట్లు వేయకపోతే మీరే నష్టపోతారు- సీఎం చంద్రబాబు
నేను మాట ఇచ్చి ప్రజలను ఎప్పుడైనా మోసం చేశానా..? ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నా.
Chandrababu Representative Image (Image Credit To Original Source)
- మళ్లీ నేనే ముఖ్యమంత్రిని అయి ఉంటే వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయ్యేది
- పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను 2026 నాటికి పూర్తి చేస్తాం
- ఇంతగా కష్టపడుతున్న నన్ను మళ్లీ గెలిపించుకునే బాధ్యత మీకు లేదా?
Chandrababu: రాష్ట్ర పునర్ వైభవం కోసం తాను, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ జతకట్టి అఖండ మెజారిటీ సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లాలో 12 కు 10 స్థానాలు గెలిచామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 12కు 12 స్థానాలు గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికలకు ముందు మార్కాపురం, మదనపల్లి, పోలవరంను జిల్లాలుగా చేస్తానని మాట ఇచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ మూడు ప్రాంతాల వెనుకబాటును గుర్తించి వాటి అభివృద్ధి కోసం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాలుగా ప్రకటించి ఎన్నికల హామీని నెరవేర్చామన్నారు.
మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ లో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కాపురం ప్రజా వేదిక సభలో మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధి గురించి చంద్రబాబు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చెరిగారు.
30 సంవత్సరాల క్రితం తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితులను గమనించి వెలిగొండ ప్రాజెక్ట్ కు 1996 మార్చి 5న భూమి పూజ చేశానని చంద్రబాబు తెలిపారు. అటువంటి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి జాతికి అంకితం చేసే అదృష్టాన్ని ఆ భగవంతుడు తనకు కల్పించాడని అన్నారు. ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే భావనతోనే తన మదిలో వెలిగొండ ప్రాజెక్ట్ పుట్టుకొచ్చిందన్నారు. తాను పాలనా పగ్గాలు చేపట్టే నాటికి పాలన పడకేసిందని, చీకటి రోజులు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. అటువంటి పరిస్థితులను అధిగమించి నేడు రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మేలా పాలన సాగిస్తున్నామన్నారు. 2019లో మళ్లీ తానే ముఖ్యమంత్రి అయి ఉంటే 2021 లోనే వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీరు అందించే వాడిని అని చంద్రబాబు అన్నారు.
జగన్ ప్రజలను మోసం చేశారు..
”అధికారంలోకి వస్తే ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలుసార్లు పూర్తి చేస్తానని చెప్పి పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేశారు. నేను మాట ఇచ్చి ప్రజలను ఎప్పుడైనా మోసం చేశానా? నల్లమల సాగర్ పూర్తి కోసం 2540 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 900 కోట్లు కేటాయించాల్సి ఉంది. వైసీపీ హయాంలో వెలిగొండకు ఖర్చు చేసింది కేవలం 500 కోట్లు. ఇన్ని పనులు పెండింగ్ పెట్టి పనులు పూర్తయ్యాయని ప్రజలకు పంగనామాలు పెట్టిన వ్యక్తి జగన్. రాష్ట్రమంతా వన్ సైడ్ ఎలక్షన్ దిశగా ప్రజలు అడుగులు వేస్తే యర్రగొండపాలెం ప్రజలు మాత్రం వైసీపీనే గెలిపించారంటే నాకు చాలా బాధ వేసింది.
మాకు ఓటు వేయకపోతే మీకే నష్టం..!
మనకు కావాల్సింది కులం మతం కాదు. ఎవరు మంచి చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు అన్నదే కావాలి. భారీ ఎత్తున పేదలకు, వెనకబడిన వారికి పెన్షన్ల పెంచా. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నా. ఈరోజు సంక్షేమ పథకాలు పొంది రేపు ఓట్లు మా కూటమి ప్రభుత్వానికి వేయకపోతే మీరే నష్టపోతారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను 2026 నాటికి పూర్తి చేస్తాం. ఈఏడాది జులై నాటికి వెలిగొండ ప్రాజెక్ట్, నల్లమల సాగర్ ద్వారా నీరు అందిస్తాం. మార్కాపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా మారుస్తా. ప్రపంచానికి ఎక్కువగా పండ్లు ఎగుమతులు చేస్తున్న ప్రాంతం రాయలసీమ. అదే దిశగా మార్కాపురాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది. అందుకు ప్రజలు కూటమి ప్రభుత్వానికి గుద్దుడే గుద్దుడుగా ఓట్లు వేసేలా బాధ్యత తీసుకోవాలి.
భూములు కబ్జా చేస్తే వారి తాట తీస్తా..
గత పాలకుల్లోని కొందరు దుర్మార్గులు.. మార్కాపురం ప్రాంతంలో పట్టా భూములను ప్రభుత్వ భూములుగా మార్చి సమస్యలు సృష్టించారు. వాటిని త్వరలో పరిష్కరిస్తా. రాష్ట్రంలో ఎవరైనా భూములు కబ్జా చేస్తే వారి తాట తీసే బాధ్యత నాది. భూ సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లకు ఏడాది టైమ్ ఇస్తున్నా. నూతన మార్కాపురం జిల్లాలో జిల్లా కలెక్టర్ పాలన కార్యాలయాల నిర్మాణాల కోసం 50 కోట్లు కేటాయిస్తున్నా. జిల్లాలో ఫ్లోరైడ్ వల్ల సక్రమంగా పుట్టిన వారు దివ్యాంగులుగా మారుతున్నారు. దీన్ని రూపు మాపేందుకే వెలిగొండ ప్రాజెక్ట్ నీరును ప్రతి ఇంటికి కొలాయి ద్వారా ఇస్తాం.
అసెంబ్లీ సాక్షిగా వేంకటేశ్వర స్వామిని అవమానించారు. 20 లక్షల లడ్డూలలో కల్తీ నెయ్యిని కలిపి భక్తులకు పంచారు. బాబాయ్ ని కత్తితో చంపి ఆ కత్తిని నారాసుర రక్త చరిత్ర అంటూ నా చేతిలో ఎలా పెట్టాలా అని జగన్ చూశారు. ఇప్పుడు అదే తరహాలో టీటీడీ లడ్డూలలో కల్తీ నెయ్యిని జగన్ కలిపి ఆ కల్తీని హెరిటేజ్ కు అంటగట్టాలని ఛూస్తున్నారు. నా తల్లిని తిడితే నేను పడాలా? ఇంతకాలం రాష్ట్రం బాగు కోసం భరించాను. ఇకపై తిడితే ఊరుకోను.
అభివృద్ధికి కులం, మతం, ప్రాంతం అనేది లేదు. తెలుగు జాతే నా ప్రాణం. అదే నాకు గౌరవం. తెలుగు ప్రాంత ప్రజల కోసం కష్టపడి పనిచేసే బాధ్యత నాది. ప్రతి కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు ఉండాలనే పాలసీని త్వరలో తేబోతున్నాం. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం స్థానంలో పెద్ద కుటుంబం గొప్ప కుటుంబం అనే నినాదం తేబోతున్నాం. నేను ప్రజలను ముందుకు తీసుకుపోవాలని కష్టపడుతుంటే వైకుంఠ పాలిలా మీరు మాత్రం నన్ను కింద పడేస్తున్నారు.
మా కులం వాడు అని ఎన్నుకుంటే మీ కొంప మునుగుతుంది..
ఇంతగా కష్టపడుతున్న నన్ను మళ్లీ గెలిపించుకునే బాధ్యత మీకు లేదా? మన కులం, మన కుటుంబం, మన మతం వాడని ఎన్నుకుంటే మీ కొంప మునుగుతుంది. గొప్ప సంకల్పం ఉన్న వారిని ఎంచుకోవాలని, మీ ఆశీస్సులు మా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండాలని కోరుతున్నా. నేను ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్ట్ ను నేనే పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ రుణం తీర్చుకుంటా. దేవుళ్ల జోలికి, గుడుల జోలికి వస్తే ఎవరినీ వదలను. కుట్రలు కుతంత్రాలు చేస్తే వాటిని ఎలా చేధించాలో నాకు తెలుసు. ఉద్యాన వనాలు పెట్టడానికి త్వరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొస్తా. రాష్ట్రంలో మార్పు తెచ్చే బాధ్యత నాది. వాటిని వినియోగించుకునే బాధ్యత మీది” అని చంద్రబాబు అన్నారు.
Also Read: రఘురామ టార్చర్ ఇష్యూ.. ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టులో బిగ్ ట్విస్ట్
