TTD EO Shyamala Rao
TTD EO Shyamala Rao: తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అన్నారు. శనివారం తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల వద్ద నుంచి సలహాలు, ఫిర్యాదులను ఈవో శ్యామలరావు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.
వైకుంఠ ఏకాదర్శి పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల నిమిత్తం ఆన్‌లైన్‌లో 1 లక్ష 40 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కేటాయించామని శ్యామలరావు తెలిపారు. దాతలకు ప్రత్యేకంగా గదులు కేటాయింపు ఉండదని చెప్పారు. పదిరోజుల పాటు సిఫార్సు లేఖలపై దర్శనం కేటాయింపు రద్దు చేయడం జరుగుతుందని, ప్రముఖులు నేరుగా వస్తేనే దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. పది రోజుల పాటు సుమారు ఏడు లక్షల మందికి స్వామివారి దర్శన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 8గంటలకు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) దర్శనం ప్రారంభం అవుతుందని, ఉదయం 4.40గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభం అవుతాయని తెలిపారు.
తిరుమలలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో నాలుగు కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ద్వారా టోకెన్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. జనవరి 10 నుంచి 12వ తేదీ వరకు సంబంధించి 9వ తేదీన ఉదయం 5గంటల నుంచి 1.20లక్షల టోకెన్స్ జారీ చేయడం జరుగుతుందని ఈవో తెలిపారు. చివరి ఏడు రోజులు (13 నుంచి 19వ తేదీ వరకు) శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ లో యథావిధిగా టోకెన్స్ జారీ చేస్తారని చెప్పారు. టోకెన్స్ జారీ చేసిన భక్తులకు మాత్రమే పది రోజుల పాటు దర్శన భాగ్యం ఉంటుందని ఈవో తెలిపారు. గోవింద మాల ధరించిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు లేవని, ఆ సమయంలో వికలాంగులు, వయో వృద్ధులు, ఎన్ఆర్ఐ, ఇతర దర్శనాలు రద్దు చేయడం జరిగిందని తెలిపారు.
Also Read: Gossip Garage : లీగల్ ఫైట్‌తో లీడర్లకు భరోసా ఇస్తున్న బీఆర్ఎస్.. గులాబీ బాస్ వ్యూహం ఏంటి?
జనవరి 7వ తేదీన కోయిల్ అళ్వార్ తిరుమంజనం.. వైకుంఠ ఏకాదశి రోజు స్వర్ణ రథం, ద్వాదశి రోజు చక్రస్నాన మహోత్సవం నిర్వహిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయాగ్ లో జరిగే కుంభమేళాలో టీడీపీ పాల్గొంటుందని, కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని, తిరుమలలో జరిగే కైంకర్యాలు జరిపే విధంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని, శ్రీవారి కల్యాణం నాలుగు రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పారు. పరకామనితో పాటుగా తిరుమలలో చాలా అంశాలపై స్టేట్ విజిలెన్స్ విచారణ జరుపుతోందని, స్టేట్ విజిలెన్స్ నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.