TTD : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.. లేదంటే డబ్బులు పోయినట్లే..
TTD : టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి భక్తులను మోసగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీటీడీ హెచ్చరించింది.
- Harish Thanniru
- Updated on- July 30, 2026 / 01:07 PM IST
TTD has advised devotees to be vigilant against fake websites
TTD : టీటీడీ (Tirumala Tirupati Devasthanams) అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి భక్తులను మోసగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీటీడీ హెచ్చరించింది. దర్శనం, సేవా టికెట్ల బుకింగ్ పేరుతో భారీ మొత్తాలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన విజిలెన్స్ విభాగం.. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
తిరుమల శ్రీవారి భక్తులను లక్ష్యంగా చేసుకుని టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించి మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దర్శనం, సేవా టికెట్ల బుకింగ్ పేరుతో భక్తుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘TTDDevasthanam.Online’ పేరుతో ఉన్న ఈ నకిలీ వెబ్‌సైట్‌లో సుప్రభాత సేవ, కల్యాణోత్సవం, తోమాల సేవ, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం వంటి సేవలకు బుకింగ్‌లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తున్నారు. ప్రతి సేవకు ప్రత్యేకంగా ధరలు నిర్ణయించి, వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఒక్కో భక్తుడి నుంచి రూ.10,500 వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అదనపు లడ్డూలకు ఒక్కోదానికి రూ.50 చొప్పున వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది.
టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా కేవలం డొమైన్ పేరులో స్వల్ప మార్పులు చేసి ఈ నకిలీ సైట్‌ను రూపొందించారని అధికారులు తెలిపారు. ఇందులో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు సమాచారం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ భక్తులను హెచ్చరించింది. శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, టికెట్ల బుకింగ్‌లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే అనుమానాస్పద వెబ్‌సైట్లు లేదాంటే లింకులు కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసింది.
ఇదిలాఉంటే.. ఈ నకిలీ వెబ్‌సైట్‌ను వెంటనే తొలగించాలని సంబంధిత డొమైన్ ప్లాట్‌ఫారమ్ నిర్వాహకులకు టీటీడీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అలాగే ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా భక్తులను మోసం చేసే వారిపైచట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
