Ttd Key Decision
TTD key decision on Srivari Arjitha Services : తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలకు వేళయింది. కరోనా కారణంగా సంవత్సర కాలంగా ఆగిపోయిన ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి. షరతులు వర్తిస్తాయంటూనే.. భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొనవచ్చంటోంది టీటీడీ. మరి ఆ కండీషన్స్ ఏంటి..? కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 నుంచి శ్రీవెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనేందుకు అనుమతిచ్చింది. కరోనా కారణంగా గత సంవత్సరం మార్చి 20 నుంచి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది.
అప్పటి నుంచి సేవలన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. ఉగాది నుంచి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన తిరుప్పావడ, అష్టదళ పాదపద్మారాధన, అభిషేక సేవల్లో భక్తులకు టీటీడీ అనుమతిచ్చింది. ముందస్తుగా అర్జిత సేవలను బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే సేవలకు అనుమతించనున్నారు. గతేడాది మార్చి 20 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 13 వరకు ముందస్తుగా ఆర్జిత సేవా టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు వెల్లడించింది టీటీడీ. కరెంట్ బుకింగ్ సదుపాయం ఉండదని.. ఒకవేళ దర్శనం వద్దనుకుంటే డబ్బులు వాపస్ చేస్తామని టీటీడీ స్పష్టం చేసింది.
ఇక 2021 సంవత్సరానికి సంబంధించి 28 వేల 258 సుప్రభాత టికెట్లను భక్తులు ముందస్తుగా బుక్ చేసుకున్నారు. అందులో తోమాల సేవ కోసం 6 వేల 808 మంది, అష్టదళ పాదపద్మారాదన సేవ కోసం 2 వేల 124 మంది, తిరుప్పావడ సేవ కోసం 2 వేల 136 మంది, అభిషేకంలో పాల్గొనేందుకు 5 వేల 464 మంది ముందస్తుగా బుక్ చేసుకున్నవారిలో ఉన్నారు. వీరికి మాత్రమే ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది టీటీడీ. ఏడాదికి ఒకసారి సర్కార్ సేవలుగా విశేషపూజ, సహస్ర కళషాభిషేకం సేవలు నిర్వహించనన్నుట్లు టీటీడీ తెలిపింది. వార్షికోత్సవంగా వసంతోత్సవం నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఇక ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు కండీషన్స్ అప్లై అవుతాయంటున్నారు టీటీడీ అధికారులు. సేవల్లో పాల్గొనే భక్తులు మూడు రోజుల ముందుగా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్లను తీసుకుని రావాల్సి ఉంటుందని.. వైకుంఠం కాంప్లెక్స్ వద్ద కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపిస్తేనే.. శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.