Tirumala: తిరుమలలో రూ.300 టికెట్ల ద్వారా మాత్రమే భక్తులకు దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి కరోనా ఎఫెక్ట్‌ పడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో దర్శనాల సంఖ్యను టీటీడీ తగ్గించింది. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయానికీ భక్తులు నుంచి స్పందన పూర్తిగా తగ్గింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను టీటీడీ మరింతగా తగ్గించే అవకాశం ఉంది.

ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసిన తిరుమల తిరుపతి దేవస్థానం.. మే 1వ తేదీ నుంచి రోజుకు కేవలం 15 వేల మందికి మాత్రమే స్వామి దర్శనానికి అవకాశం కల్పించాలని భావిస్తోంది. కేవలం 300 రూపాయల దర్శన టికెట్ల ద్వారా మాత్రమే భక్తులను అనుమతించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

మరోవైపు తెలంగాణలో కూడా కోవిడ్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీరామనవమి సీతారాముల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలపై అధికారులు ఆంక్షలు విధించారు. భద్రాచలంలో ఈ నెల 20న ఎదుర్కోలు ఉత్సవం, 21న సీతారాముల కల్యాణం, 22న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. అయితే ఈ వేడుకలకు భక్తుల దర్శనాలు రద్దు చేస్తూ దేవస్థానం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వేడుకలన్నీ ఆలయంలోని నిత్య కల్యాణ మండప ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు