ఏపీలో ఇసుక కొరత మరో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులను బలి తీసుకుంది. గుంటూరు జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
ఏపీలో ఇసుక కొరత మరో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులను బలి తీసుకుంది. గుంటూరు జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది రోజులుగా పనులు లేక మనస్థాపానికి గురైన ఇద్దరు కార్మికులు బలవన్మరణం చేసుకున్నారు. ఇటీవల ఇసుక కొరత ఏర్పడడంతో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కార్మికులకు పనులు లేకుండా పోయాయి. కుటుంబం గడవడం కష్టమైంది. దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ పెద్దలను కోల్పోయి మృతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన నాగరాజు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా భవన నిర్మాణ రంగ పనులు లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. మనస్తాపానికి గురైన నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దీంట్లో భాగంగా నాగరాజు భార్యను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు పొన్నూరులో అడపా రవి అనే భవన నిర్మాణ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇసుక సంక్షోభంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.