పాపం పసివాళ్లు : గోడసందులో ఇరుక్కున్నారు

  • Publish Date - February 29, 2020 / 08:01 AM IST

ఎలా ఇరుక్కున్నారో తెలియదు..కానీ ఓ చిన్న గోడ సందులో బయటకు రాలేక నానా అవస్థలు పడ్డారు ఇద్దరు చిన్నారులు. ఊపిరి ఆడలేక వారిద్దరూ పడిన బాధలు వర్ణనాతీతం. చివరకు స్కూల్ యాజమాన్యం తెలుసుకుని వెంటనే రంగంలోకి దిగి..తగిన సహాయక చర్యలు చేపట్టడంతో ఇద్దరు చిన్నారులు బయటకు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేట చోటు చేసుకుంది. 

నులకపేటలో ఉర్దూ పాఠశాల ఉంది. ఇక్కడ 200 మంది విద్యార్థులుంటారు. కులమతాలకతీతంగా ఇక్కడ విద్యాబోధన జరుగుతుంటుంది. రమణ బాబు, మున్నాలు ప్రాణ స్నేహితులు. వీరి సోదరులు ఈ స్కూల్లో చదువుకుంటుంటారు. అన్నయ్యలతో మాట్లాడుదామని 2020, ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్న సమయంలో రమణ, బాబులు వచ్చారు. అనంతరం ఆడుకుందామని వెళ్లిపోయారు. 

బాల్ స్కూల్ పక్కనే ఉన్న భవనంలో పడిపోవడంతో దానిని తీసుకుందామని వెళ్లారు. గోడ మధ్యలో ఇరుక్కపోయారు. బయటరాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏడుపులు పెట్టారు. వీరి ఆర్తనాదాలు విన్న స్థానికులు విషయాన్ని స్కూల్ యాజమాన్యానికి సమాచారం తెలియచేశారు. 

రంగంలోకి దిగిన ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో గోడను పగులగొట్టారు. అనంతరం ఇరుక్కున్న రమణ, బాబులను బయటకు తీశారు. తీసే సమయంలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి చికిత్స అందించారు. మొత్తానికి సమయానికి స్పందించిన పాఠశాల సిబ్బంది చిన్నారులను బయటకు తీయడంతో ఊపిరిపీల్చుకున్నారు తల్లిదండ్రులు.