టీడీపీకి ’కోవూరు’ టెన్షన్ : టికెట్ ఒకటే.. ఇద్దరు ఫైటింగ్

  • Publish Date - February 20, 2019 / 06:17 AM IST

నెల్లూరు : కోవూరు నియోజకవర్గంలో టికెట్‌ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో పాటు మరో సీనియర్ నేత టికెట్‌పై ఆశపెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్‌ రాకపోతే…టెన్షన్‌ పడకుండా ముందుగానే వైసీపీ నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త అధిష్ఠానానికి తెలియడంతో….ఉన్నదీ పోయే…ఉంచుకున్నదీ పోయే అన్నట్లు తయారైంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటీ? 

ఎన్నికలు సమీపిస్తుండటంతో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో….టికెట్‌ ఆశిస్తున్న నేతల మధ్య పోటీ పెరిగింది. కోవూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పోలంరెడ్డిపై పార్టీతో పాటు ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీలో ఎళ్ల తరబడి ఉంటున్న నేతలను కాదని….కొత్తగా వచ్చిన వారికి పార్టీ పదవులు, నామినేటేడ్ పోస్టులు కట్టబెడుతున్నారంటూ పోలంరెడ్డిపై కార్యకర్తలు భగ్గుమంటున్నారు.

మరోవైపు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి…టీడీపీ అభ్యర్థిగా చేజర్ల వెంకటేశ్వరెడ్డి పోటీ చేస్తూ అన్ని విధాలా అండగా ఉంటానన్నారు. దీంతో కోవూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తన టికెట్‌కు ఎసరు పెడుతున్నారని భావించిన పోలంరెడ్డి…ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారని…ఫోన్‌ రికార్డ్స్‌ చంద్రబాబు వద్ద ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే…వైసీపీలో చేరుతానని ఆ పార్టీ నేతలకు హామీ ఇచ్చినట్లు రికార్డింగ్స్‌లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల నెల్లూరులో జరిగిన ఎన్టీఆర్ గృహాల ప్రారంభోత్సవంలో…చుట్టపుచూపుగా వచ్చి వెళ్లారు పోలంరెడ్డి. సీఎం చంద్రబాబు కూడా శ్రీనివాసులురెడ్డికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పోలంరెడ్డికి టికెట్ వచ్చే ఛాన్స్ లేదన్న ప్రచారం జరుగుతోంది. 

కోవూరు నుంచి టికెట్‌ ఆశిస్తున్న మరో నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి….గత ఎన్నికల్లోటికెట్‌ ఆశించి భంగపడ్డ ఆయన…ఈ సారి ఎలాగైనా టికెట్‌ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. సోమిరెడ్డి అండదండలతో టికెట్ సాధించి….అసెంబ్లీకి పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్‌ ఇవ్వకపోయినా….పోటీ చేసి తీరుతానని ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలు చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టారు. అదే సమయంలో వైసీపీ నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. వైసీపీ అధికారంలోకి వస్తే నామినేటేడ్ పోస్టు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పోలంరెడ్డికి టికెట్‌ రాదని జోరుగా ప్రచారం జరుతుండటంతో….పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి డైలమాలో పడ్డారు. చంద్రబాబు నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అన్న వెయిట్ చేస్తున్నారు. 

ఈ ఇద్దరు నేతలు గోడ మీద పిల్లుల్లా మారడంతో…టిడిపి అధిష్టానం వీరిపై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీకి విధేయుడుగా ఉన్న జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా పార్టీలోనే ఉంటూ టీడీపీ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న చేజర్లకు… కోవూరు మండలంతోపాటు నియోజకవర్గంలోని మండలస్థాయి టీడీపీ నేతలతో సత్సంబంధాలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించినా…అనూహ్యంగా పోలంరెడ్డి పార్టీలో చేరి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా పోలంరెడ్డి విజయం సాధించడంలో…చేజర్ల కీలక పాత్ర పోషించారు. అయితే ఆర్థిక పరిస్థితి కారణంగా టికెట్‌ దక్కే అవకాశం తక్కువనే చెప్పుకోవాలి. మరోవైపు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పేరుని కోవూరుకి పరిశీలిస్తున్నట్లు సమాచారం. విష్ణుని టిడిపిలో చేర్చుకుని ఆయన్ని కోవూరు నుంచి బరిలో దింపాలన్న ఆలోచనలో ఉంది టీడీపీ. విష్ణువర్ధన్ రెడ్డికి నియోజకవర్గంలో బంధువర్గంతో పాటు మంచి సంబంధాలూ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ విధేయులకు టికెట్ దక్కుతుందా ? లేదంటే కొత్త వ్యక్తిని బరిలోకి దించుతుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.