జగన్.. జాగ్రత్తగా పాలించు.. కరెంటు కోతలెక్కువైతే కష్టమే: ఉండవల్లి

  • Publish Date - October 1, 2019 / 10:31 AM IST

ఎన్నికల తర్వాత కొంతకాలం మీడియా ముందుకు రాకుండా గ్యాప్ ఇచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈ సంధర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.

కశ్మీర్‌లో రెండు నెలలుగా కర్ఫ్యూ కొనసాగడం బాధాకరమని ఉండవల్లి అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో కేంద్రం కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించడం దారుణం అని విమర్శించారు.

గాంధీజీ- నెహ్రూ వేర్వేరు కాదని, గాంధీ ఏం చెప్పారో.. నెహ్రూ అదే చేశారని అన్నారు. నల్లధనానికి నోట్లరద్దు ఎలా పరిష్కారం కాదో? అలాగే ఉగ్రవాద సమస్యకు ఆర్టికల్‌ 370 రద్దు పరిష్కారం కాదని అన్నారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో జగన్ పాలనపై మాట్లాడిన ఉండవల్లి.. పరిపాలనలో జగన్‌ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో ఇన్ని కోట్లు ఆదా అవుతాయని ఊహించలేదని అన్నారు. అయితే రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఎక్కువైతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు ఉండవల్లి.