Union Steel Minister Kumaraswamy : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం రూ.35వేల కోట్ల అప్పుల్లో ఉందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. బ్యాంకు రుణాలు, వడ్డీ, మెటీరియల్ సప్లయ్ చేసిన వారికి చెల్లింపులు కూడా దీనిలో ఉన్నాయని ఆయన చెప్పారు. వచ్చే రెండేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే నెంబర్ 1 గా నిలుస్తుందన్నారు. ఉక్కు పరిశ్రమను అప్పుల ఊబి నుంచి బయటికి తీసుకురావడమే ప్రధమ కర్తవ్యం అని ఆయన తెలిపారు. ప్లాంట్ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ తర్వాత SAILలో మెర్జ్ చేసే విషయంపై ఆలోచిస్తామన్నారు.
స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు చొరవతోనే ఈ ప్యాకేజీ వచ్చిందన్నారు రామ్మోహన్ నాయుడు. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీకి సహకరించిన కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామనే హామీని ఆయన నిలబెట్టుకున్నారని చెప్పారు.
Also Read : నవ్యాంధ్రలో కూటమి ఫ్యూచర్‌కు తిరుగులేదా? బాబు, పవన్ మాటల్లో లాంగ్ టర్మ్ వ్యూహం ఉందా?
‘ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ఎన్నో విధాలుగా ఇబ్బంది కలిగిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కార మార్గం వైపు అడుగులు పడ్డాయి. నిన్న ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ ఆఫైర్స్ సమావేశంలో 11వేల 440 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు పరిశ్రమకు రిలీజ్ చేయడం జరిగిందని ఆనందంగా తెలియజేసుకుంటున్నా’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
‘ఏపీ ప్రజల మనోగతాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి వల్లే ఇది సాధ్యమైంది. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలుపుకుంది. స్టీల్ ప్లాంట్ కు రూ.11వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం హర్షణీయం. స్టీల్ ప్లాంట్ నిర్వహణకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది’ అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.
కాగా.. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఉక్కు పరిశ్రమను పునరుజ్జీవింపజేసేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఏకంగా రూ.11వేల 440 కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై కేంద్రం ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read : వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు.. చాలా శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది?