Vaikunta dwara darshan at Tirumala temple : వైకుంఠ ఏకాదశికి తిరుమల కొండ ముస్తాబైంది. తొలిసారిగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్న నేపథ్యంలో టీటీడీ (TTD) విద్యుత్‌శాఖ విభాగం అద్భుతమైన లైటింగ్ ఏర్పాట్లు చేసింది. 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం ఉదయం నుంచి ఆరు టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని (Tirumala Temple) అలంకరించనున్నారు. మరో నాలుగు టన్నులతో బయట ప్రాంతాల్లో అలంకరిస్తారు. కాగా, శ్రీవారి ఆలయంలో శుక్రవారం వేకువజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనం (Vaikunta dwara darshan) మొదలుకానుంది.
2020, డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాల నుంచి ఒంటిగంట 30 నిమిషాల వరకు తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస (Dhanurmasam) కైంకర్యాలు నిర్వహిస్తారు. తర్వాత దక్షిణ, ఉత్తర భాగంలోని వైకుంఠ ద్వారాలను తెరుస్తారు. ఒకటిన్నర గంటల నుంచి 4 గంటల వరకు అభిషేకం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనం (vip break darshan) మొదలుకానుంది. సుమారు 3 నుంచి 4 వేల మంది వివిధ కేటగిరీలకు చెందిన వీఐపీలకు దర్శన ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రంలోగా టికెట్లు మంజూరు చేయనున్నారు. వీరికి ఆలయం ముందు నుంచి క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
కోవిడ్ (Covid – 19) నిబంధనలతో సాధారణ కంటే తక్కువ స్థాయిలో భక్తులు తిరుమలకు రానుండటంతో పరిమితంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా సిబ్బందికి సూచనలు చేశారు. అలిపిరి, గదుల కేటాయింపు కేంద్రాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, ఆలయం వద్ద థర్మల్ స్ర్కీనింగ్ చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. అన్ని ప్రదేశాలను నిరంతరం శానిటైజ్ చేయనున్నారు. తిరుమలలో భక్తుల వాహనాలకు పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేశారు. కాగా, గురువారం నుంచే కొండపై రద్దీ పెరిగింది. డిసెంబరు 25వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకూ రోజుకు ముప్పై వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు టీటీడీ అధికారులు.