Vangalapudi Anitha: అబద్దపు హామీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోసం చేశారని టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. సీఎం జగన్ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖపట్నంలో శనివారం టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao)తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ జగనన్న స్టిక్కర్ల పథకానికి శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు.
‘నిన్న రాష్ట్రంలో కొత్త పురోహితులను చూశాను. కొంత మంది భుజానికి సంచులు వేసుకొని భజన బృందంలా తిరుగుతున్నారు. జగనన్నే మా భవిష్యత్తు (Jagananne Maa Bhavishyathu) అనే స్టిక్కర్లు వారే ఇళ్లకు అంటిస్తున్నారు. సీఎం జగన్ జగనన్న స్టిక్కర్ల పథకానికి శ్రీకారం చుట్టారు. జైలులో 13 నెలలు ఉండి బయటకు వచ్చిన వ్యక్తి రాష్ట్రానికి భవిష్యత్తా? ఈసారి నుంచి మాట తప్పదు మడమ తిప్పడు అన్న వైసీపీ నాయకుల నాలుకను ప్రజలు కొయ్యాలి. సీఎం జగన్ (CM Jagan) గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. నేను మాట్లాడుతున్న మాటలపై ఎవరు చర్చకు వచ్చిన నేను సిద్ధం.
సీఎం జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు కాకపోతే నథింగ్. సీఎం అయిన తర్వాత తండ్రి ఫోటోనే పక్కన పెట్టేసారు. కోళ్ల ఫామ్ యజమానికి కోళ్లపై ఎటువంటి ప్రేమ ఉంటుందో రాష్ట్ర ప్రజలపై సీఎం జగన్ కి అదే తరహా ప్రేమ ఉంది. మద్యపాన నిషేధంపై జగన్ మాట ఎందుకు తప్పారు? రాష్ట్రంలో ధరలు నియంత్రణ చేస్తానన్న జగన్ మాట ఏమైంది? కరెంటు చార్జీలు నియంత్రణ చేస్తానన్న జగన్ ఇప్పటికి ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారు. సీఎం జగన్ మాట తప్పదా లేదా అనేది ఆయన మనస్సాక్షినే ప్రశ్నించుకోవాలి. బాబాయ్ శవం దగ్గర సీఎం జగన్ ఆస్కార్ స్థాయిలో యాక్టింగ్ చేశారు.
Also Read: పరిటాల రవి పేరు ఎక్కువగా తలచుకుంటున్నావు.. ధన్యవాదాలు..
ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ను గాలికొదిలేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి విజయమ్మకు.. సీఎం అయిన తరువాత జగన్ ఇంట్లో కనీసం ఒక్క పూట భోజనం పెట్టలేదు. ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్న కోసం పాదయాత్ర చేసిన చెల్లి షర్మిల పరిస్థితి ఏమైంది? మేము ప్రతి నియోజకవర్గంలో పర్యటించి సీఎం జగన్ మోసాలను ప్రజలకు తెలియజేస్తాం. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయం. చంద్రన్న (Chandranna) మా భవిష్యత్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న తల్లుల రుణం తీర్చుకోవాలని జగన్ అనుకుంటే రానున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం మానుకోవాల’ని అన్నారు.
Also Read: చంద్రబాబు.. నేను రెడీగా ఉన్నా, మీరు రెడీయా? : మంత్రి జోగి రమేశ్
జగన్ కు ప్రజలు బుద్ధి చెబుతారు
టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి పట్టిన దరిద్రం జగనన్న అని ప్రజలు అనుకుంటున్నారు. సీఎం జగన్ యువత భవిష్యత్ ను నాశనం చేశారు. నాయకుడు అంటే ఆదర్శంగా ఉండాలని మోసాలు చేయకూడదు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించని వ్యక్తి సీఎం జగన్. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో జగన్ కు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతార’ని అన్నారు.