Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ వ్రతాలకు అనుమతి… తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఉచితం

ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు అనుమతి ఇచ్చారు. శుక్రవారం (ఆగస్టు 27,2021) ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహా మండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాలు జరగనున్నాయి.

Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు అనుమతి ఇచ్చారు. శుక్రవారం (ఆగస్టు 27,2021) ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహా మండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాలు జరగనున్నాయి. వ్రతం టికెట్‌ ధరను దేవస్థానం 1500 వందలుగా నిర్ణయించింది. టికెట్‌ కొనుగోలు చేసిన భక్తులకు దేవస్థానమే పూజా సామాగ్రిని సమకూర్చునుందని దుర్గగుడి అధికారులు తెలిపారు. కాగా, తెల్లరేషన్‌ కార్డు ఉన్న భక్తులకు ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పించారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే భక్తులు తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. భక్తుల నుంచి వరలక్ష్మి వ్రతాలకు అనూహ్య స్పందన వచ్చింది.

దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 27న శ్రావణ మూడో శుక్రవారాన్ని పురస్కరించుకొని నిర్వహించే సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతానికి బుధవారం గడువు ముగిసే సమయానికి 225 దరఖాస్తులు వచ్చాయి. వరలక్ష్మీ వ్రతాన్ని ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాల వల్ల స్వయంగా చేసుకోలేని పేద మహిళలకు మల్లికార్జున మహామండపంలో దేవస్థానం రుత్వికులు ఉచితంగా చేయించేందుకు నిర్ణయించారు. తెల్లరేషను కార్డు కలిగిన పేద మహిళల నుంచి పూర్తి చేసిన దరఖాస్తులను బుధవారం సాయంత్రం 4 గంటల వరకు దేవస్థానం అధికారులు స్వీకరించారు. వరలక్ష్మీ పూజలో పాల్గొనే మహిళలకు అవసరమైన పూజాద్రవ్యాలు, రవిక, గాజులు, కుంకమతోపాటు రెండు పూర్ణాలు, పులిహోర ప్యాకెట్లను ప్రసాదంగా అందజేస్తారని అధికారులు తెలిపారు.

దుర్గమ్మ సన్నిధిలో వరలక్ష్మీ వ్రతం టిక్కెట్టు రూ.1500 చెల్లించి పూజలో పాల్గొనే భక్తులకు ఈ నెల 26వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. దేవాదాయ శాఖ వెబ్‌సైట్‌లో టిక్కెట్టు పొందేందుకు వీలు కల్పించారు. టిక్కెట్టు కొని పూజలో పాల్గొనే మహిళలకు ఈ నెల 27న ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ అధికారులు కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కులు ధరించని భక్తులను ఆలయంలోకి అనుమతించడం లేదు.

ట్రెండింగ్ వార్తలు