Local Boy Nani: లోకల్ బాయ్ నానికి సజ్జనార్ వార్నింగ్.. ఇవేం దిక్కుమాలిన పనులు?

బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ పై వీసీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.

Local Boy Nani: లోకల్ బాయ్ నానికి సజ్జనార్ వార్నింగ్.. ఇవేం దిక్కుమాలిన పనులు?

VC Sajjanar

Updated On : February 20, 2025 / 4:26 PM IST

Local Boy Nani: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లు కుటుంబాలను బలితీసుకుంటున్నాయి. యువకులతోపాటు ఉద్యోగులు, పోలీసులు వాటి బారినపడుతున్నారు. అదేపనిగా బెట్టింగ్ చేస్తూ ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. తద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ లతో డబ్బులు పోగొట్టుకున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.

ఇటీవలి కాలంలో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వీడియోలు పెడుతూ ఫేమస్ అయిన వారు.. డబ్బుకోసం కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ అమాయకపు యువకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అయితే, కొద్దికాలంగా ఇలాంటి వారి ఆటలను ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ ట్విటర్ ద్వారా అరికడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు పోస్టుచేస్తూ లోకల్ బాయ్ గా, ఫిషర్ మెన్ గా పాపులర్ అయిన నాని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వీడియోను సజ్జనార్ షేర్ చేశారు.

ఇన్ స్టాగ్రామ్,ఫేస్ బుక్, యూట్యూబ్ లో ఫిషర్ మ్యాన్ గా నాని అనే వ్యక్తికి మంచి ఫాలోయింగ్ ఉంది. అతన్ని ఫాలో అయ్యే నెటిజన్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది. తనకున్న ఫాలోయింగ్ ను సొమ్ముచేసుకునేందుకు అతను ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నాడు. ఆ వీడియోను సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసి బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లు ఆపండి అంటూ సూచించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లమని, మేం ఏం చేసిన నడుస్తుందనే భ్రమలో ఉండకండి. చట్టప్రకారం మీకు శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించారు.

సజ్జనార్ ట్వీట్ ప్రకారం.. ‘‘మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఇవేం దిక్కుమాలిన పనులు. మీ టాలెంట్ ను ఇతరత్రా రంగాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోవడంలో తప్పులేదు. అలాచేస్తే మిమ్మల్ని సమాజం హర్షిస్తోంది. ఇలాంటి పనుల ద్వారా ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం ఎంత వరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లమని, మేం ఏం చేసిన నడుస్తుందనే భ్రమలో ఉండకండి. చట్టప్రకారం మీకు శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లను ఆపండి.’’ అంటూ సూచించారు.

VC Sajjana

గతంలోనూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ సన్నీ యాదవ్ పైనా సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభంకోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. అంటూ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.