మిర్చి సెంచరీ, బీన్స్ డబుల్ సెంచరీ..! మండిపోతున్న కూరగాయల ధరలు, వణికిపోతున్న ప్రజలు

ఐదుగురు ఉన్న కుటుంబంలో ఒక్కరోజు కూరగాయలకు దాదాపు వంద రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సామాన్యులు వాపోతున్నారు.

Vegetable Prices : ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్లు ఉంది ఏపీ, తెలంగాణలోని సామాన్యుల పరిస్థితి. రైతు బజార్లు, వారపు సంతలు, కూరగాయల మార్కెట్లు.. ఎక్కడి చూసినా ధరల మోతే కనిపిస్తోంది. కొనబోతే కొరివి అన్నట్లుగా ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు కూరగాయలు చూస్తేనే వామ్మో అనే పరిస్థితి నెలకొంది. పెరిగిన ధరలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు.

పచ్చిమిర్చి మరింత ఘాటెక్కింది. బీన్స్ ధరతో బెంబేలెత్తిస్తోంది. టమాటో ధరల మోత మోగిస్తోంది. గత నెలలో ఉన్న రేట్లకు ఇప్పుడు రెండింతలు పెరగడంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్ లో కిలోకు 20 నుంచి 25 రూపాయల వరకు ధర పలుకుతూ ఉండగా.. వారాంతపు సంతల్లో కిలోకు 60 నుంచి 80 రూపాయలు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి, చిక్కుడు సెంచరీ దాటగా.. బీన్స్ డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తోంది. ఐదుగురు ఉన్న కుటుంబంలో ఒక్కరోజు కూరగాయలకు దాదాపు వంద రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సామాన్యులు వాపోతున్నారు.

మామూలు రోజుల్లో పచ్చిమిర్చి కిలో ధర రూ.25 నుంచి రూ.40 మధ్య ఉండేది. టమాటాల ధర కూడా కిలో 15 నుంచి 20 రూపాయలు పలికేది. కానీ, దిగుబడులు తగ్గి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. వారం రోజుల క్రితం కిలో పచ్చిమిర్చి ధర రూ.70 ఉండగా.. తాజాగా కిలో రూ.140కి చేరింది. ఇక టమాట గత వారం కిలో రూ.22 పలకగా.. తాజాగా ఏకంగా రూ.50 పలుకుతోంది. వీటితో పాటు కిలో బీన్స్ ధర రూ.150గా ఉంది. పెద్ద చిక్కుళ్లు రూ.100, క్యారెట్ ధర రూ.100, దొండకాయ 60 రూపాయలు, బంగాళాదుంప 50 రూపాయలు, బెండకాయ కిలో ధర 60 రూపాయలు పలుకుతోంది.

అటు అల్లం వెల్లులి ధరలు కూడా మండిపోతున్నాయి. అల్లం ధర మార్కెట్ లో బాగా పెరిగిపోయింది. ఓపెన్ మార్కెట్ లో ప్రస్తుతం అల్లం కేజీ ధర 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పలుకుతోంది. రైతు బజార్లలో కిలో ధర రూ.190 నుంచి 210 రూపాయల వరకు ఉంది.

మరో నెల రోజుల పాటు కూరగాయల ధరలు మండిపోయే అవకాశం ఉంది. ఎండలు ఎక్కువగా ఉండటం, సాగునీరు లేకపోవడం కారణాలతో రైతులు కూరగాయలు పండించడం లేదు. దీంతో తక్షణ అవసరాలకు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ రాష్ట్రాలపైనే ఆధార పడాల్సి వస్తోంది. జూన్ నెల చివరి వరకు ఇదే పరిస్థితి నెలకొననుంది. అయితే, రెండు రాష్ట్రాలకు తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి టమాట, బీన్స్, క్యాప్సికమ్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

అటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల నుంచి గతంలో ప్రతీరోజూ 40 నుంచి 50 లారీల టమోటాలు దిగుమతి కాగా.. ప్రస్తుతం 10 లారీలు మించడం లేదు. చిక్కుడుకాయ్ కూడా మార్కెట్ లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఆఫ్ సీజన్ లో స్థానికంగా కూరగాయల దిగుమతులు ఎక్కువగా ఉండేవి. దీంతో కమీషన్ ఏజెంట్లు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్ కు కూరగాయలు తెప్పిస్తారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకే కొనాల్సిన పరిస్థితి నెలకొంది. మండిపోతున్న ఎండలకు తోడు సాగునీరు లేకపోవడం కూరగాయల ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

Also Read : టీవీ, వాషింగ్ మెషీన్, ఏసీ ధరలు పెరగనున్నాయా? ఎర్ర సముద్రంలో సంక్షోభమే కారణమా..

ట్రెండింగ్ వార్తలు