బైరెడ్డి, రోజా మెడకు బిగుస్తున్న ఉచ్చు..? నేడు ప్రభుత్వానికి రిపోర్టు.. 30పేజీల నివేదికలో సంచలనాలు..?

వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’పై విజిలెన్స్ విచారణ పూర్తయింది.. ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సిద్ధమైంది..

RK Roja Byreddy Siddharth Reddy

Aadudam Andhra: వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి. ఈ అవినీతిలో వైసీపీ హయాంలో క్రీడల మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రోగ్రాంపై విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది.

‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహణలో అవినీతి జరిగిందని అప్పటి క్రీడల మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. శాప్ ప్రస్తుత చైర్మన్ రవినాయుడు కూడా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు.. విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో పాటు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించి పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.

విజిలెన్స్ అధికారులు తమ విచారణకు సంబంధించి 30పేజీల నివేదికను సిద్ధం చేశారు. ఆ నివేదికను ఇవాళ ప్రభుత్వానికి అందజేయనున్నారు. కిట్ల కొనుగోలు, పోటీల నిర్వహణలో రూ.40కోట్ల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. విచారణలో.. నిధుల దుర్వినియోగం జరిగిందని, ఈ అవకతవకల వెనుక రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు ఉన్నారని విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఈ నివేదిక అందిన తరువాత అవినీతి అక్రమాలు జరిగినట్లు నిగ్గుతేలితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.