Ycp And Congress
Prashant Kishor : ఎన్నికలకు ఇంకా సమయం చాలానే ఉంది. అప్పుడే రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మళ్లీ అధికారమే దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఒంటరిగానే పోటీ చేస్తుందా ? లేదా ఇతర పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పొత్తులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ చేశారు. వీరు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. విశాఖపట్టణానికి వచ్చిన ఎంపీ విజయసాయి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పార్టీకే వైసీపీ సపోర్టు ఉంటుందని, విధానపరమైన నిర్ణయాలపై సీఎం జగన్ స్పందిస్తారన్నారు. పార్టీ పదవులపైనా కూడా స్పందించారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యమని వెల్లడించిన ఆయన ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో.. తనకు అది కావాలి.. ఇది కావాలి అనే ప్రస్తావన రాదన్నారు.
Read More : Prashant Kishor : సోనియాగాంధీతో ప్రశాంత్ కిషోర్ అత్యవసర భేటీ.. కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానం!
మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వైసీపీ పుట్టిందని, స్ట్రాటజీస్ చెప్పినట్లు చేయాలా ? అని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ ను భూ స్థాపితం అవడానికి పునాది వేసిందే సీఎం జగన్ అని, సోనియా గాంధీని ఎదిరించే వారు అప్పట్లో లేరని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు దేశ రాజకీయాలను సోనియా శాసిస్తున్న సమయంలో.. జగన్ ధైర్యం చేశాడన్నారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీట్లు వెతుక్కొనే పరిస్థితి తీసుకొచ్చింది జగన్ అని.. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనాలు నవ్వుకుంటారని తెలిపారు.
Read More : Congress party: పీకేకు కాంగ్రెస్‌లో ఏ పదవి ఇవ్వబోతున్నారు? సీనియర్ల కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది?
రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతారని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలో తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపడం.. ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ లో పొత్తుల అంశాన్ని ప్రస్తావించారని సమాచారం. ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి ప్రశాంత్ కిశోర్ తాజాగా ప్రతిపాదన చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆయన పలు దఫాలు సమావేశమైనట్లు తెలుస్తోంది. జగన్ తో ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ టీమ్ కలిసి పనిచేస్తోంది. మరి కాంగ్రెస్ – వైసీపీ పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో చూడాలి.