Vijayasai Reddy
Vijayasai Reddy – Kilaru Rajesh: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. ఈ కేసులో మరో వ్యక్తి కూడా త్వరలోనే అరెస్టు అవుతారని చెప్పారు.
ప్రకాశం జిల్లాలో ఇవాళ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని ఆరోపించారు. సీమెన్స్ కంపెనీ పెట్టుబడుల్లో టీడీపీ నేత నారా లోకేశ్ ప్రధాన అనుచరుడు కిలారు రాజేశ్ ది ప్రధాన పాత్ర అని చెప్పారు. ఆయనను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని అన్నారు. చంద్రబాబును త్వరలోనే పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారని అన్నారు. మూడు విధాల ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశామని చెప్పారు.
టీడీపీ బంద్ కు పిలుపునిస్తే ఎవరూ పట్టించుకోలేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీలో రాజకీయాలను చంద్రబాబు డబ్బుమయం చేశారని తెలిపారు. చంద్రబాబుపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, అన్నింటిలోనూ స్టేలమీద బతుకుతున్నారని చెప్పారు. చంద్రబాబు చేపట్టిన ప్రతి ప్రాజెక్టు ఒక స్కామేనని అన్నారు. తన తండ్రి నీతిమంతుడని లోకేశ్ బావిస్తే విచారణ ఎదుర్కోవాలని చెప్పాలని వ్యాఖ్యానించారు.
టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారని, ఆయన అలా ఊహించుకోవడంలో తప్పులేదని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాలేదని అన్నారు. బీజేపీలో పురందేశ్వరితో పాటు అనేక మంది చంద్రబాబుకి కోవర్టులేనని చెప్పారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు జిల్లాలోని నియోజకవర్గ నాయకులతో రెండు రోజులుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో పార్టీకి సంబంధించిన నిర్ణయాలు మాజీ మంత్రి బాలినేని ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. పార్టీకి మరింత బలం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.