Chandrababu Case : జైల్లోనే చంద్రబాబు.. బెయిల్, కస్టడీ పిటిషన్లు డిస్మిస్ చేసిన కోర్టు

బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకి బెయిల్ ఇవ్వలేము అని తెలిపింది. Chandrababu Case Updates

Chandrababu Case Updates

Chandrababu Case Updates : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏ కోర్టులోనూ ఊరట లభించలేదు. చంద్రబాబు మూడు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ రేపటికి (అక్టోబర్ 10) వాయిదా పడింది. ఇక.. చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు సైతం డిస్మిస్ చేసింది.

రెండు పిటిషన్లూ డిస్మిస్..
చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. పిటిషన్లను కొట్టివేసింది. గత శుక్రవారమే రెండు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పుని సోమవారానికి రిజర్వ్ చేసింది. ఇవాళ రెండు పిటిషన్లనూ డిస్మిస్ చేసింది.

Also Read : చంద్రబాబు కేసు.. సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా, జస్టిస్ త్రివేది కీలక వ్యాఖ్యలు

19 వరకు జైల్లోనే చంద్రబాబు..
బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకి బెయిల్ ఇవ్వలేము అని తెలిపింది. అదే సమయంలో ఆయనను సీఐడీ కస్టడీ కూడా ఇవ్వలేము అంది. చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దన్న సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. అటు ఆయనను కస్టడీకి ఇవ్వొద్దన్న చంద్రబాబు లాయర్ వాదనలతోనూ ఏకీభవించింది. ఈ క్రమంలో రెండు పిటిషన్లను డిస్మిస్ చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. బెయిల్ రాకపోవడంతో చంద్రబాబు ఈ నెల 19వ తేదీ వరకు రాజమండ్రి జైల్లోనే ఉండనున్నారు.

సుప్రీంకోర్టులో విచారణ వాయిదా..
అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను ధర్మాసనం రేపటికి (అక్టోబర్ 10) వాయిదా వేసింది. ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ చంద్రబాబు తరపు లాయర్ హరీశ్ సాల్వే వాదనలు విన్న ధర్మాసనం.. రేపు సీఐడీ, ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ల వాదనలు వింటామంది. జీఎస్టీ డీజీ స్కిల్ స్కామ్ లో చేసిన విచారణ కాపీని సుప్రీంకోర్టుకు సమర్పించాము అని సీఐడీ తరపు లాయర్ ముకుల్ రోహత్గీ తెలపగా.. హైకోర్టులో వాదనల తర్వాతే కాపీ సమర్పించారని, 2018 కంటే ముందు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చంద్రబాబు లాయర్ హరీశ్ సాల్వే వాదించారు. కాబట్టి చంద్రబాబుకి 17ఏ వర్తిస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన.

హైకోర్టులో ఎదురుదెబ్బ..
అటు ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఇప్పటికే ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉన్న పీటీ వారెంట్లను పరిగణలోకి తీసుకోమని కోర్టును సీఐడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కోర్టు అనుమతిస్తే చంద్రబాబును మళ్లీ పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉందని న్యాయవర్గాలు అంటున్నాయి.