Ithavaram Munneru Vaagu
Ithavaram Munneru Vaagu: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా (NTR District) ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మున్నేరు వాగు (Munneru Vaagu) ఉప్పొంగడంతో ఎన్టీఆర్ జిల్లా ఐతవరం (Ithavaram) దగ్గర హైవేపై వరదనీరు చేరింది. దీంతో అధికారులు పరిసరాల్లోని గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు రాత్రి నుంచి విజయవాడ – హైదరాబాద్ హైవే మార్గంలో రాకపోకలు నిలిచిపోగా.. వాటిని దారిమళ్లించారు. మరోవైపు టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ – విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపటం జరుగుతోందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు.
ఐతవరం వద్ద మునేరు వరద ఉధృతిని విజయవాడ పోలీసు కమీషనర్ కాంతిరాణా టాటా పరిశీలించారు. సహాయక చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 10టీవీతో సీపీ మాట్లాడారు. వర్షాల వల్ల మున్నేరు, కట్టలేరు నదులు పొంగాయని, 65వ జాతీయ నెంబర్ రోడ్‌పై ఐతవరం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ దారిలో వాహనాలు నిలిపి వేశామని, రాత్రి నుంచి ఇతర మార్గాల మీదుగా ట్రాఫిక్ మళ్లించామని సీపీ చెప్పారు. ఖమ్మం దగ్గర కొంచెం వరద తగ్గినట్లు తెలుస్తుందని, గురువారం కంటే ఈరోజు వరద ప్రవాహం కాస్త తగ్గిందని చెప్పారు. రేపటి (శనివారం) కి పూర్తిగా వరద తగ్గే అవకాశం ఉందని సీపీ తెలిపారు. వాహన రాకపోకలకు పరిస్థితి బట్టి రేపటి నుంచి అనుమతి ఇస్తామని సీపీ కాంతిరాణా టాటా చెప్పారు.
HYD – Vijayawada Highway Closed : హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రాకపోకలు బంద్
45మంది వరదల్లో చిక్కుకోగా వారిని క్షేమంగా బయటకి తీసుకు వచ్చామని అన్నారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ టీంలు రిస్క్యూ ఆపరేషన్ చేశాయని, కలెక్టర్ రెవిన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని అన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద వరద నీరు రెండున్నర లక్షల క్యూసెక్కుల కిందకి వదిలారని, తద్వారా మునేరు వరద ఉధృతి తగ్గుతుందని భావిస్తున్నామని సీపీ చెప్పారు. సూర్యాపేట, ఖమ్మం ఎస్పీలతో మాట్లాడుతూనే ఉన్నామని, వరద పరిస్థితిని బట్టి ప్రజలుకూడా తమ ప్రయాణాల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సీపీ కాంతిరాణా టాటా సూచించారు. మరో 24 గంటల వరకు విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిని పునరుద్ధరించలేమని, ఆ తరువాత వరద ఉధృతి తగ్గితే పునరుద్ధరిస్తామని సీపీ చెప్పారు.