Vijayawada Psycho
Vijayawada Psycho : విజయవాడ అయ్యప్పనగర్ లో సైకో కలకలం రేగింది. ఓ వ్యక్తి అర్థరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి మహిళల పక్కన నిద్రపోతున్నాడనే వార్తలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. అర్థరాత్రి అయితే చాలు మహిళలు భయంగా గడుపుతున్నారు. కంటి మీద కనుకు కరువైంది. ప్రజల్లో ఆందోళన పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
”సైకో గురించి అయ్యప్పనగర్ వాసులు పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అర్థరాత్రి వేళ అజ్ఞాత వ్యక్తి తిరుగుతున్నాడని మాకు ఫిర్యాదు అందింది. అన్ని యాంగిల్స్ లో విచారణ చేస్తున్నాం. సైకో కాదు అజ్ఞాత వ్యక్తి. ఆ ఇంట్లో వాళ్లు పూర్తిగా వాకిళ్లన్నీ ఓపెన్ చేసి పడుకున్నారు. ఎవరో వ్యక్తి వచ్చారని అన్నారు.
రేకుల షెడ్లు, బయట పడుకున్న వారి నుంచి మాకు ఫిర్యాదులు వచ్చాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమీ లేవు. కచ్చితంగా ఆ వ్యక్తిని పట్టుకుంటాము. ప్రజలు భయపడాల్సిన పని లేదు. ఆందోళన చెందొద్దు. కచ్చితంగా అతడు దొరుకుతాడు. సీసీ కెమెరాలు పెట్టించాలని స్థానికులను కోరాము. విజయవాడ సిటీలో భయపడే పరిస్థితి లేదు. ఈ ఫిర్యాదు అందిన తర్వాత ప్రత్యేకంగా మూడు మఫ్టీ టీమ్స్ వేశాము.
సైకో అని భయబ్రాంతులకు గురి కావాల్సిన పని లేదు. ఇంతవరకు అతడు ఎవరికీ ఏ హాని చెయ్యలేదు. అక్కడ ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. ఆ వ్యక్తిని డైరెక్ట్ గా చూసిన వారు ఎవరూ లేరు. రోడ్డు మీద చూశామని ఎవరూ చెప్పడం లేదు. అర్థరాత్రి తిరుగుతున్న వ్యక్తి కచ్చితంగా దొంగ అయి ఉండొచ్చు. మరొకటి అయి ఉండొచ్చు. మానసిక పరిస్థితి బాగోలేని వ్యక్తి అయినా ఉండొచ్చు. అన్ని యాంగిల్స్ లో ఎంక్వైరీ చేస్తున్నాము. గత ఏడాది కాలంలో విజయవాడ సిటీలో మహిళలపై ఎలాంటి ఘటనలు జరగలేదు. ఎవరూ భయపడే పరిస్థితులు సిటీలో లేవు. పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు” పటమట పోలీస్ స్టేషన్ సీఐ సురేష్ చెప్పారు.