Kethireddy Venkatarami Reddy (Photo : Twitter, Google)
Kethireddy Venkatarami Reddy – Dharmavaram : సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన పట్టుచీరల వ్యాపారులపై దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. దీన్ని ఆయన చాలా సీరియస్ తీసుకున్నారు. ధర్మవరం పట్టు చీరల వ్యాపారులపై విజయవాడ వస్త్ర వ్యాపారి దాడి చేశాడు. తన సిబ్బందితో దారుణంగా కొట్టించాడు. దుస్తులు తీయించి మరీ దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధిత వ్యాపారులు ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఆశ్రయించారు. దాంతో ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
ఇది.. కేవలం ఇద్దరి మీద జరిగిన దాడి కాదని, చేనేత వ్యవస్థపై జరిగిన దాడి అని ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. ఈ ఘటన మీద ఇప్పటికే విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశామన్నారు. దాడికి నిరసనగా వారం రోజులపాటు పట్టు చీరల దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చేనేత వ్యాపారులు నష్టాల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో డబ్బులు అడిగినందుకు దాడులు చేస్తారా? అని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. దాడికి పాల్పడిన వ్యాపారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతవరకు దీన్ని వదిలేదే లేదని తేల్చి చెప్పారు.
Also Read..Jada Sravan Kumar: జగన్ వదిలిన బాణం షర్మిల పాదయాత్ర చేయలేదా? మేమూ చేసి తీరతామంతే..
అసలేం జరిగిందంటే..
విజయవాడ స్టెల్లా కాలేజీ సమీపంలో ఆలయ శిల్క్స్ ఉంది. ధర్మవరం, హిందూపురం తదితర ప్రాంతాల నుంచి చేనేత పట్టుచీరల వ్యాపారులు ఆలయ శిల్క్స్ కు చీరలు పంపిస్తుంటారు. దీనికి సంబంధించి డబ్బులు చెల్లించాల్సి ఉంది. దాంతో 20 రోజుల క్రితం 8 మంది వ్యాపారులు ఆలయ శిల్క్స్ దుకాణానికి వెళ్లారు. బకాయిలు చెల్లించాలని వ్యాపారిని అడిగారు. వారం రోజుల్లో ఇస్తానని అతడు చెప్పడంతో వెళ్లిపోయారు. కాగా, వచ్చిన వారిలో ఇద్దరు వ్యాపారులు శశి, ఆనంద్‌లు ఆ పూటకు నగరంలోనే ఉండిపోయారు. సాయంత్రం మళ్లీ ఆలయ శిల్క్స్ దుకాణానికి వెళ్లారు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
దాంతో ఆలయ శిల్క్స్ యజమాని రెచ్చిపోయాడు. తన సిబ్బందితో కలిసి ఆనంద్, శశిలను దుకాణంలోని థర్డ్ ఫ్లోర్‌లోని స్టోర్ రూంలో నిర్బంధించాడు. అనంతరం వారి దుస్తులు తొలగించి వీడియో తీస్తూ కర్రలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేశాడు. కొట్టొద్దని వారు వేడుకున్నా వదల్లేదు. విచక్షణారహితంగా దాడిచేశారు. రోజంతా వారిని షోరూంలో బంధించారు. తర్వాత విడిచిపెట్టారు.
కాగా.. తన ఫోన్ లో తీసిన వీడియోలను ధర్మవరంలోని మిగిలిన వ్యాపారులకు పంపించాడు ఆలయ శిల్క్స్ ఎండీ. బకాయిల కోసం విజయవాడ వస్తే మీకు కూడా ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చాడు. కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.