Vijayawada Tragedy: విజయవాడలో ఘోరం.. ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురు మృగాళ్లు అరెస్ట్
విజయవాడ(Vijayawada Tragedy) నగరంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తించే దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
- V Santhosh Kumar
- Published on- August 29, 2026 / 08:33 PM IST
Vijayawada vambay colony gang rape case five youths detained by police
- వాంబే కాలనీలో సామూహిక అత్యాచారం
- బాధితురాలు ఆసుపత్రికి తరలింపు
- ఐదుగురు నిందితుల అదుపు
Vijayawada Tragedy: విజయవాడ నగరంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తించే దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. వాంబే కాలనీ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న ఒక మహిళపై ఐదుగురు మృగాళ్లు విచక్షణారహితంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాలనీవాసులను, సామాజిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ అఘాయిత్యం ఆలస్యంగా వెలుగుచూడటంతో, సమాజంలో మహిళల రక్షణ, శాంతిభద్రతల స్థితిగతులపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అర్ధరాత్రి వేళ అఘాయిత్యం – ఆసుపత్రికి తరలింపు:
బాధితురాలు వాంబే కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి(Vijayawada Tragedy) సమయంలో స్థానికంగా జులాయిగా తిరిగే ఐదుగురు యువకులు మద్యం మత్తులో ఆమె ఇంట్లోకి చొరబడి దారుణానికి ఒడిగట్టారు. సోమవారం ఉదయం ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల ప్రజలు లోపలికి వెళ్లి పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆటోలో విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించారు.
కేసు నమోదు – నిందితుల విచారణ:
ఈ ఘటనపై స్థానికులు నున్న పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా, పోలీసులు తక్షణమే స్పందించి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించి, స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అనంతరం కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఐదుగురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నట్లు నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ వెల్లడించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
