Violation of Election Code in visakha : ఏపీలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలను యథేచ్చగా నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా మునగపాక మండలంలో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఇదంతా జరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు తొలి విడత పంచాయితీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో ఇవాళ నామినేషన్లు భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు దాదాపు 7 వేల 460 నామినేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. వార్డు స్థానాలకు 23 వేల 318 నామినేషన్లు వేశారు. మొదటి రోజుతో పోలిస్తే రెండోరోజు భారీగా పెరిగాయి. శుక్ర, శనివారం రెండు రోజులు కలిపి ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 8 వేల 773 నామినేషన్లు దాఖలవ్వగా… వార్డు సభ్యుల స్థానాలకు 25వేల 519 మంది నామినేషన్లు వేశారు.