AP Telangana Bifurcation Issues : ఆశలు ఆవిరి.. తెలుగు రాష్ట్రాలకు మరోసారి నిరాశే.. విభజన సమస్యలకు దొరకని పరిష్కారం

విభజన సమస్యలకు మోక్షం దొరుకుతుందన్న తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. తెలుగు రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది.

AP Telangana Bifurcation Issues : విభజన సమస్యలకు మోక్షం దొరుకుతుందన్న తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. తెలుగు రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం లభించలేదు. 14 అంశాలపై ఏపీ, తెలంగాణ అధికారులు వాదనలు వినిపించారు. ప్రత్యేక హోదా ఊసే లేకపోగా, విశాఖపట్నం రైల్వేజోన్ పై వివాదం నెలకొంది.

విశాఖ రైల్వేజోన్ సాధ్యం కాదని సమావేశానికి హాజరైన రైల్వే బోర్డు చైర్మన్ చెప్పడంతో హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాల్సిన అంశంపై వ్యక్తిగతంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో విశాఖ రైల్వేజోన్ పై ఆశలు వదులుకోవాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ అధికారులు రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో వెయ్యి కోట్లు ఇవ్వాలని అడిగారు. దీనిపై స్పందించిన కేంద్రం ఇప్పటికే ఇచ్చిన 1500 కోట్ల రూపాయలపై లెక్కలు చూపాలని కోరింది. దీంతో ఏపీ అధికారులు మిన్నకుండిపోయారని సమాచారం.

రాజధాని నిర్మాణం కోసం శివరామకృష్ణన్ కమిటీ రూ.29వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసిన విషయాన్ని ఏపీ అధికారులు గుర్తు చేస్తే, కేంద్రం నుంచి స్పందన లేదు. వెనుకబడిన 7 జిల్లాలకు రూ.20వేల కోట్ల నిధులు ఇవ్వాలని ఏపీ అధికారులు ప్రస్తావిస్తే.. ఐదేళ్లే ఇవ్వాలని నిర్ణయం జరిగిందన్న విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది. విభజన చట్టం ప్రకారం ఏపీలో సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు అధికారులు.

కాగా, ఏపీ లేవనెత్తిన చాలా అంశాలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశాన్ని తెలంగాణ ప్రస్తావించింది. కానీ, దీనిపై ఎలాంటి చర్చా జరగలేదు. షెడ్యూల్ -9లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజనపై షీలా బేడీ కమిటీ సిఫార్సులను ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దాని ప్రకారం 89 సంస్థలు విభజన చేయాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కేవలం 53 సంస్థలనే విభజన చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీంతో మిగిలిన సంస్థల విభజనపై ఉన్న అభ్యంతరాలు ఏంటో తెలపాలని తెలంగాణను ప్రశ్నించింది కేంద్రం. షెడ్యూల్ పరిధిలోని సంస్థల విభజనపై న్యాయసలహా ప్రకారం ముందుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది.

అటు అమరావతిలో ర్యాపిడ్ రైల్వే కనెక్టివిటీ, హైదరాబాద్ నుంచి అమరావతికి ఎంఎంటీఎస్ ఫీజ్ బులిటీని కాదని కేంద్రం తెలిపింది. చట్టంలో పొందుపర్చని సంస్థలతో పాటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి, సింగరేణికి చెందిన హెచ్ పీ మిషనరీస్ లిమిటెడ్ సంస్థలపై పీటముడి కొనసాగుతోంది. విభజన సమస్యలపై ఇప్పటివరకు 25సార్లు సమావేశాలు జరిగాయి. ఏడాదిలోనే ఇది నాలుగోసారి. ఈ సమావేశం కూడా మొక్కుబడి తంతుగా ముగియడంతో విభజన సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు