Ys Jagan: జగన్ ముందు మరో సవాల్‌..! ఆ విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి? ఎన్డీయే సర్కార్‌కు మద్దతిస్తుందా?

రాహుల్‌ గాంధీ ఓట్‌ చోరీ ప్రస్తావించినప్పుడు కూడా జగన్‌ ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఈవీఎంల పనితీరుపై పలువురు వైసీపీ నేతలే గోల్‌మాల్‌ అంటూ చెప్పుకొచ్చారు తప్ప..జగన్‌ ఎప్పుడూ కేంద్రాన్ని ఒక్కమాట అనలేదు.

Ys Jagan: జగన్ ముందు మరో సవాల్‌..! ఆ విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి? ఎన్డీయే సర్కార్‌కు మద్దతిస్తుందా?

Updated On : November 7, 2025 / 8:26 PM IST

Ys Jagan: అప్పుడు ఓట్‌ చోరీ..ఇప్పుడు S.I.R. రెండూ కీలక అంశాలే. దేశంలోని ప్రతిపక్షాలు గొంతెత్తున్న రెండు మేయిన్ టాపిక్స్. బిహార్‌ టు వెస్ట్ బెంగాల్‌ వరకు అపోజిషన్ పార్టీలన్నీ ఓట్‌ చోరీ, S.I.Rపై ఎన్డీయే సర్కార్‌ను కార్నర్ చేస్తున్నాయి. త్వరలో ఏపీలో కూడా S.I.R చేపట్టే అవకాశం ఉందట. S.I.Rపై వైసీపీ స్టాండ్‌ ఎలా ఉండబోతోంది? వైసీపీ అపోజ్‌ చేస్తుందా? ఎన్డీయే సర్కార్‌కే మద్దతు ఇస్తుందా.?

S.I.R. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజిన్. దీన్నే ‘సర్’ అంటున్నారు. ఓట్ల సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక ప్రక్రియ చుట్టూ రాజకీయం రచ్చ చేస్తోంది. S.I.Rకు దేశంలోని విపక్షాలు నో చెబుతున్నాయి. రాహుల్ గాంధీ అయితే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓటర్ల గల్లంతు చోరీ అని పెద్ద ఆరోపణలే చేశారు. బీజేపీకి అనుకూలమైన వారి జాబితానే రూపొందిస్తున్నారని..పైగా ఒకే ఇంటి నెంబర్‌తో ఒకే ఓటర్ పేరు మీద ఎన్నో ఓట్లు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఆయన ఈసీని బీజేపీని కలిపి విమర్శలు చేశారు.

ఇక తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్‌లో దీదీ కూడా S.I.Rను వ్యతిరేకిస్తున్నారు. మమత అయితే ఇది సైలెంట్ రిగ్గింగ్ కోసమే అని పెద్ద అలిగేషనే చేశారు. ఇండియా కూటమి, వామపక్షాలు దేశంలోని ఎన్డీయేతర పార్టీలన్నీ S.I.Rకు నో అంటే నో అంటున్నాయి. విపక్షాల నిరసనలు, ఆగ్రహాలు కంటిన్యూ అవుతుండగానే దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రెండో దశ S.I.R ప్రక్రియ నవంబర్ 4 నుంచి మొదలైపోయింది.

ఏపీలో కూడా త్వరలోనే S.I.R ప్రక్రియ స్టార్ట్ కాబోతోందట. ఇప్పుడు సెకండ్‌ ఫేస్ S.I.R ప్రాసెస్‌ నడుస్తుండగా..థర్డ్‌ ఫేస్‌లో ఏపీ ఉండొచ్చని అంటున్నారు. ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2025కు సంసిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారులను చీఫ్‌ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఆదేశించడం చర్చకు దారితీస్తోంది. S.I.Rను దేశంలోని విపక్షాలన్నీ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి.

S.I.R ప్రక్రియను వైసీపీ స్వాగతిస్తుందా?

ఇప్పటిదాకా దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి అభిప్రాయం అయితే వ్యక్తం కాలేదు. వైసీపీ S.I.R ప్రక్రియకు అనుకూలమా లేక వ్యతిరేకమా అన్నది కూడా స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇది అధికారంలో ఉన్న పార్టీలకు ముఖ్యంగా ఎన్డీయే పార్టీలకే S.I.R లాభం చేకూరుస్తుందన్నది ఇండియా కూటమి నేతలు ఆరోపణ. ఏపీలో 2024 ఎన్నికల్లో ఈవీఎంల ప్రభావంతో కూడా తాము ఓడిపోయామని వైసీపీ నేతలు పలుసార్లు ఆరోపించారు. ఇప్పుడు S.I.R ప్రక్రియను స్వాగతిస్తారా లేక కాదు అంటారా అన్నదే కీలకంగా మారింది.

S.I.Rకు వైసీపీ ఓకే అంటే ఒకలా కాదు అంటే మరోలా ఏపీ రాజకీయం మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు..15 నెలలుగా ప్రతిపక్షంలో కూడా వైసీపీ ఎక్కడా కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపట్టలేదు. లేటెస్ట్‌గా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వైసీపీ ఎన్డీయే అభ్యర్థికే సపోర్ట్ చేసింది. గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన క్యాండిడేట్‌కే మద్దతిచ్చింది ఫ్యాన్ పార్టీ. ఈ క్రమంలో ఏ విషయంలో కూడా వైసీపీ ఎన్డీయే విధానాలను తప్పుబట్టలేదు.

ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని జగన్..

రాహుల్‌ గాంధీ ఓట్‌ చోరీ ప్రస్తావించినప్పుడు కూడా జగన్‌ ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఈవీఎంల పనితీరుపై పలువురు వైసీపీ నేతలే గోల్‌మాల్‌ అంటూ చెప్పుకొచ్చారు తప్ప..జగన్‌ ఎప్పుడూ కేంద్రాన్ని ఒక్కమాట అనలేదు. పైగా ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ ఏపీ గురించి ప్రస్తావించలేదని..ఆయనకు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య హాట్ లైన్ నడుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు జగన్.

అయితే జాతీయ స్థాయిలో వైసీపీ పదేపదే ఎన్డీఏకు బేషరతుగా మద్దతివ్వడం అనేక రకాల చర్చకు దారితీస్తోంది. ఏపీ వరకూ వస్తే మాత్రం వైసీపీ అధినాయకత్వం ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంది. కేంద్రంలో మాత్రం బీజేపీకే మద్దతు ఇస్తుంది. ఏపీకి చెందిన బీజేపీ నాయకులు జగన్‌ను గట్టిగానే విమర్శిస్తుంటారు. జాతీయ స్థాయి లీడర్లు అయితే జగన్‌ పేరు తీసి తీయనట్లుగా విమర్శించామంటే.. విమర్శించామని మాట్లాడుతుంటారు. ఇవన్నీ బట్టి చూస్తే..ఇప్పుడు S.I.R విషయంలో కూడా జగన్‌ స్టాండ్‌ ఏంటో స్పష్టం చేయకపోవచ్చని అంటున్నారు. S.I.Rపై తమ వైఖరి ఏంటో చెప్పకుండానే..ఏపీలో కూటమి సర్కార్‌ కార్నర్ చేసే స్కెచ్ జగన్‌ వేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read: మళ్లీ జగన్ పాదయాత్ర.. అధికారిక ప్రకటన.. ఎప్పటినుంచంటే..