Rain Alert : బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలుపడే అవకాశం.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే?

Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి వాతావరణం ఉంది. ఈనెల 9వ తేదీన ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది 10వ తేదీకి అల్పపీడనంగా ..

Rain Alert : బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలుపడే అవకాశం.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే?

Rain Alert

Updated On : November 8, 2025 / 6:47 AM IST

Rain Alert : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణలోని రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. మొంథా తుపాను ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే, తుపాను ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి వాతావరణం ఉంది. ఈనెల 9వ తేదీన ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది 10వ తేదీకి అల్పపీడనంగా మారుతుందని అంచనా. చెన్నైకి తూర్పు దిశగా 510 కిలో మీటర్ల దూరంలో ఏర్పడబోతోంది. అది ఎటువైపు వెళ్తుందో ఇప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా అనేది కూడా వెంటనే తెలియదు. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం.. అది మరీ ఎక్కువ బలంగా ఉండదు.. అయితే, తూర్పు ఆసియా నుంచి గాలులు తోడైతే వాయుగుండంగా మాచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

Also Read: దేశవ్యాప్తంగా స్కూళ్లు, ఆసుపత్రులు, రవాణా కేంద్రాల నుంచి ఇక వీధి కుక్కలను తీసుకెళ్లాలి.. అంతేకాదు..: సుప్రీంకోర్టు ఆదేశాలు 

వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఒక ప్రకటనలో తెలియచేశారు. ద్రొణి కారణంగా.. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో శనివారం వర్షాలు పడే చాన్స్ ఉంది.

ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అంచనా. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం సమయాల్లో వర్షాలు పడే చాన్స్ ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, వర్షాలు పడే సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేశారు.

అయితే, శాటిలైట్ లైవ్ నేవిగేషన్ ప్రకారం.. ఇవాళ ఏపీ, తెలంగాణలో పగలు పూర్తిగా ఎండ వాతావరణం ఉంటుంది. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. రాత్రివేళ పూర్తిగా అతి చలి ఉంటుంది.