Visakha residents Innovative protest
Visakha Residents – Innovative Protest : చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఢిల్లీలో విశాఖ వాసులు వినూత్న నిరసన చేపట్టారు. విజయ్ చౌక్ లో శీర్షాసనం వేస్తూ యోగాసనాలతో నిరసన తెలిపారు. రాష్ట్రం తిరోగమనంలో ఉందంటూ టీడీపీ యువనేతలు శీర్షాసనాలు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను దేశ ప్రజలకు తెలిసే విధంగా వినూత్న రీతిలో ధర్నాలు చేస్తున్నామని విశాఖపట్టణం టీడీపీ నేత ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు.
చంద్రబాబును కక్ష పూరిత అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్, ఆంధ్రప్రదేశ్ భవన్ లోధర్నాలు చేపట్టామని చెప్పారు. యోగా ద్వారా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తున్నామని తెలిపారు. నారా లోకేష్ కూడా రాష్ట్ర పరిస్థితులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించారని పేర్కొన్నారు. నారా చంద్రబాబు అంటే అందరికి తెలుసన్నారు.
రావణ కాష్టం పోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పోలీసులు అందరూ ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును నొక్కేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే తరహాలో పరిస్థితులు కొనసాగితే రాష్ట్రం ఉనికి పోతుందని దేశ ప్రజలకు తెలిసే విధంగా ఢిల్లీలోనే ధర్నాలు చేస్తున్నామని తెలిపారు.