Visakha North Constituency: విశాఖ నార్త్ లో ఎవరెవరు బరిలో దిగబోతున్నారు.. పోటీకి ఆసక్తి చూపని గంటా.. కారణం ఏంటి?

సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం.. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ.. తెలుగుదేశం నుంచి ఈ సీటుకు.. పోటీ బాగానే ఉంది.

Visakhapatnam North Assembly Constituency: విశాఖ ఉత్తరంలో.. రసవత్తర రాజకీయం నడుస్తోంది. గత ఎన్నికల్లో.. అంతటి వైసీపీ వేవ్‌లోనూ.. ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగిరింది. ఈసారి.. ఎలాగైనా ఈ సీటులో విక్టరీ కొట్టాలని.. అధికార వైసీపీ భావిస్తోంది. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం.. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ.. తెలుగుదేశం నుంచి ఈ సీటుకు.. పోటీ బాగానే ఉంది. అధికార వైసీపీలోనూ.. ఇద్దరు నేతలు టికెట్ రేసులో ఉన్నారు. జనసేన కూడా.. ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకుంది. మరికొందరు నాయకులు కూడా.. పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి.. ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో దిగబోతున్నారు? విశాఖ నార్త్ సీటులో.. ఈసారి కనిపించబోయే సీనేంటి?

గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేశ్ బాబు, విష్ణుకుమార్ రాజు, ఊర్మిళ గజపతిరాజు (Photo: Twitter)

విశాఖ జిల్లాలో.. విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి.. ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు.. రెండోసారి గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ప్రతి ఎన్నికల్లో.. కొత్త వారికే అవకాశం ఇస్తూ వస్తున్నారు.. ఇక్కడి ఓటర్లు. దాంతో.. అన్ని ప్రధాన పార్టీల నుంచి కొత్త నేతలు.. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచేందుకు ఆసక్తి చూపుతుంటారు. విశాఖ నార్త్ నియోజకవర్గం (Visakha North Constituency) 2009లో ఏర్పడింది. ఇప్పటివరకు 3 సార్లు ఎన్నికలు జరిగితే.. 3 పార్టీల అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు ఇక్కడి ఓటర్లు. ఏ పార్టీ కూడా ఇక్కడ.. వరుసగా రెండు సార్లు గెలుపు జెండా ఎగరేయలేకపోయింది.

ఈ నియోజకవర్గం పరిధిలో దాదాపు రెండున్నర లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో.. కాపుల ఓట్ బ్యాంక్ ప్రధానంగా ఉంటుంది. కాపుల, బీసీల మద్దతు ఉన్న పార్టీ అభ్యర్థినే.. విజయం వరిస్తుందనే టాక్ ఉంది. 2014లో.. విశాఖ నార్త్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి.. విష్ణు కుమార్ రాజు గెలుపొందారు. అప్పట్లో.. జనసేన పోటీలో లేకపోవడం, టీడీపీ, జనసేన మద్దతు ఉండటంతో.. విష్ణుకుమార్ రాజు (Vishnu Kumar Raju) గెలుపు సునాయాసమైంది. కానీ.. తర్వాతి ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. గత ఎన్నికల్లో.. విశాఖ నార్త్ నుంచి గంటా శ్రీనివాసరావు బరిలో దిగారు. వైసీపీ కూడా అభ్యర్థిని మార్చి.. కేకే రాజును పోటీలో నిలిపింది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. అంతటి వైసీపీ ప్రభంజనంలోనూ.. ఇక్కడ తెలుగుదేశం గెలుపు జెండా ఎగరేసింది.

వైసీపీ నేత పంచకర్ల రమేశ్ బాబు

వైసీపీ నుంచి పంచకర్ల 
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) నియోజకవర్గంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదనే టాక్ వినిపిస్తోంది. దాంతో.. నెడ్ క్యాప్ ఏపీ ఛైర్మన్‌గా ఉన్న వైసీపీ నేత కేకే రాజు.. విశాఖ నార్త్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో.. టీడీపీని ఢీకొట్టి తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నమ్ముతున్నారు. ఈసారి కూడా తనకే టికెట్ ఇస్తానని.. సీఎం జగన్ (CM Jagan) ప్రకటించడంతో.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నారు. ప్రత్యర్థులుగా ఎవరు పోటీ చేసినా.. విశాఖ నార్త్‌లో ఫ్యాన్ గిర్రున తిరిగి తీరుతుందని వైసీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పంచకర్ల రమేశ్ బాబు (Panchakarla Ramesh Babu) కూడా.. టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం.. ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో.. పెందుర్తి నుంచి గానీ.. విశాఖ నార్త్ నుంచి గానీ.. పోటీ చేసేందుకు రమేశ్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్లిద్దరిలో.. వైసీపీ అధినాయకత్వం ఎవరికి అవకాశం ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.

విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Photo: Facebook)

గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారా? లేదా?
ఇక.. తెలుగుదేశం నుంచి మరోసారి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారా? లేదా? అనే చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లూ.. పక్కచూపులు చూసిన గంటా.. రాష్ట్రంలో పొలిటికల్ ట్రెండ్ మారేసరికి.. మళ్లీ తన ప్రయత్నాలను విరమించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి.. తెలుగుదేశం కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సర్వం తానే అనే కలరింగ్ ఇస్తున్నారని.. పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇన్నాళ్లూ.. పోటీ చేసిన చోట మళ్లీ పోటీ చేయకుండా.. ఓటమెరుగని నేతగా.. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడ ఉండే నాయకుడిగా.. గంటా శ్రీనివాసరావుకు పేరుంది. ఆ మధ్య స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో.. రాజీనామాతో హడావుడి చేశారు గంటా శ్రీనివాసరావు. అధిష్టానంతో ఉన్న గ్యాప్ కారణంగా.. పార్టీలోనూ ఆయన ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే.. వైసీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. కానీ.. అవేవీ కొలిక్కి రాలేదు. తర్వాత.. జనసేనలోనూ చేరతారనే ప్రచారం జరిగింది. దీనిని.. గంటా ఖండించారు. ఇప్పుడు.. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు అనివార్యమైతే.. ఉన్న చోటే ఉంటే బాగుంటుందనే లెక్కలు వేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. అందుకనుగుణంగానే.. మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Also Read: ఆ ఫ్యామిలీకి ఇదే లాస్ట్ చాన్స్.. అనకాపల్లిలో రసవత్తరంగా రాజకీయం!

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో.. పార్టీ అధిష్టానం దగ్గర కూడా వ్యూహకర్తగా నిరూపించుకునే తాపత్రయం గంటాలో ఎక్కువైందనేది హాట్ టాపిక్‌ (Hot Topic)గా మారింది. ఈసారి.. ఆయన చోడవరం, భీమిలి, పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాల్లో.. ఏదో ఒక చోటు నుంచి పోటీ చేసేందుకు పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయ సమీకరణాలను బట్టి.. ఆయన నిర్ణయం ఉంటుందని.. సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడు.. స్టేట్‌లో తెలుగుదేశం వేవ్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో.. గెలిచే నియోజకవర్గంపై ఫోకస్ చేశారంటున్నారు. ఇతర నియోజకవర్గాల్లో.. గంటా పర్యటన సీనియర్లకు నచ్చడం లేదు. ఇప్పటికే.. అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu), అనిత.. గంటాపై గరంగరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. గంటా శ్రీనివాసరావు.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది.. ఆసక్తిగా మారింది.

బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు (Photo: Twitter)

విష్ణుకుమార్ రాజు సిద్ధం
ఇక.. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు.. ఈసారి పార్టీ మారైనా సరే.. విశాఖ నార్త్ నుంచే పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. 2014లో.. టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా.. నార్త్ సీటును బీజేపీకి కేటాయించారు. అప్పుడు.. విష్ణుకుమార్ రాజు గెలిచారు. తర్వాత.. ఈ సెగ్మెంట్‌పై పట్టు పెంచుకున్నారు. 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడంతో చిత్తుగా ఓడిపోయారు. అయితే.. వివాదరహితుడిగా.. సౌమ్యుడిగా విష్ణుకుమార్ రాజుకు ప్రజల్లో పేరుంది. ఈ మధ్యకాలంలో.. ఆయన మాజీ మంత్రి కన్నా బాటలోనే.. సైకిలెక్కబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) ని కలవడం, ఏపీ బీజేపీలో పరిస్థితులేమీ బాగోలేవని కామెంట్ చేయడం చూస్తుంటే.. టీడీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. విశాఖలో బీజేపీకి ఉన్న కొద్దిమంది నేతల్లో విష్ణుకుమార్ రాజు ఒకరు. ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెబితే.. మిగిలేదెవరన్న.. ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీ గనక.. విశాఖ నార్త్ నుంచి అవకాశం ఇస్తే.. పోటీ చేసేందుకు విష్ణుకుమార్ రాజు సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

ఊర్మిళ గజపతిరాజు పూసపాటి (Photo: Twitter)

తెలుగుదేశం, వైసీపీ మధ్యే పోటీ
సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా.. తెలుగుదేశం క్యాడర్ మాత్రం అలాగే ఉంది. ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా.. గెలిపించుకునేందుకు కొందరు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. దాంతో.. టీడీపీ నుంచి ఊర్మిళ గజపతిరాజు (Urmila Gajapathi Raju) టికెట్ ఆశిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అన్నీ వర్కవుట్ అయితే.. ఊర్మిళే.. పోటీకి దిగే అవకాశం ఉందంటున్నారు. ఇక.. గత ఎన్నికల్లో.. జనసేన నుంచి.. పోటీ చేసిన ఓడిన పసుపులేటి ఉషాకిరణ్ (Usha Kiran Pasupuleti).. మరోసారి విశాఖ నార్త్ బరిలో దిగేందుకు.. అంతా సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: డీపీ కొత్త ఎత్తులు.. జనసేనను నడిపించే నాయకుడు ఎవరు.. తునిలో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా?

తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే.. విశాఖ నార్త్‌ (Visakha North)లో ఈసారి చతుర్ముఖ పోటీ తప్పదనే విషయం అర్థమవుతోంది. ఇప్పటికే.. లోకల్ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయ్. ఎన్నికల నాటికి పొలిటికల్ ఈక్వేషన్స్ మారితే.. అందుకు తగ్గట్లుగా మార్పులు-చేర్పులు ఉండే అవకాశముంది. వీళ్లతో పాటు ఇదే నియోజకవర్గంపై మరికొందరు సెకండ్ క్యాడర్ లీడర్లు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఏదేమైనా.. ఈసారి కూడా తెలుగుదేశం, వైసీపీ మధ్యే పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ పోరులో.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపిస్తుందన్నదే.. ఆసక్తి రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు