Vontimitta Temple Closed : పుణ్యక్షేత్రాలకు కరోనా ఎఫెక్ట్

Vontimitta Temple Closed, Due to Corona : దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో భక్తుల రాకపోకలపై నిషేధం కూడా విధించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. కరోనా వ్యాప్తి దష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయం మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాలు భక్తులు లేకుండా పూర్తి ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం, పురావస్తు అధికారుల సమక్షంలో ఆలయానికి నోటీస్‌ అంటించారు. మే 15 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు నోటీసులో తెలిపారు. కోదండరామాలయంతోపాటు కడప జిల్లాలోని మరో 15 ఆలయాలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఆలయం మూసివేతతో ఈ నెల 21 నుంచి జరగాల్సిన శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్ధత నెలకొంది. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆరుబయట నిర్వహించే రాములోరి కల్యాణోత్సవానికి సంబంధించి ఇప్పటికే టిటిడి అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు ఇప్పటికే 50 శాతంపైగానే పూర్తయ్యాయి. ప్రస్తుత నిర్ణయంతో మరోసారి రాములోరి కల్యాణంపై సందిగ్ధత నెలకొంది.

అటు కరోనా నేపథ్యంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను కూడా క్లోజ్ చేశారు. నందలూరులోని శ్రీసౌమ్యనాథస్వామి ఆలయం మూసివేశారు. పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. దక్షిణకాశిగా పిలువబడే పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని మూసివేశారు.

మరో వైపు కేంద్రం ప్రభుత్వం ఆధీనంలోని అన్ని పర్యాటక స్థలాలు, చారిత్రక కట్టడాలను మూసివేశారు. తాజ్ మహల్ సహా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కిందకు వచ్చే అన్ని చారిత్రక కట్టాలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ప్రకటించింది.

 

ట్రెండింగ్ వార్తలు