కరోనా భయం ఇంకా వీడడం లేదు. రాష్ట్రాలను హఢలెత్తిస్తున్నాయి. వైరస్ కట్టడి చేసేందుకు నడుం బిగించాయి. అన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎక్కడికక్కడనే జన జీవనం స్తంభించిపోయింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో ఎక్కడివారెక్కడే ఉండిపోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కానీ కొంతమంది వారి వారి స్వగ్రామాలకు వెళుతున్నారు. ఎవరూ వెళ్లవద్దని, ఎవరికైనా వైరస్ ఉంటే..మరొకరికి సోకుతుందని భావంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది.
కరోనా కట్టడికి ఏపీ సరిహద్దుల దగ్గర గోడలను నిర్మించడం హాట్ టాపిక్ అయ్యింది. చిత్తూరు జిల్లాలోని మూడు బోర్డర్స్ ప్రాంతాల్లో ఇలా చేయడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్ తో పాటు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే మార్గాలకు అడ్డంగా గోడలను నిర్మించారు. ఏకంగా 6 ఫీట్ల ఎత్తులో గోడ నిర్మించారు.
గోడల నిర్మాణంపై చిత్తూరు జిల్లా అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. గోడలను కట్టడం ఏంటీ ? అని ప్రశ్నిస్తున్నారు. అత్యవసర సేవలు, నిత్యావసర సరుకులు, ఇతరత్రా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. మరి ఈ గోడలు ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తాయో చూడాలి.