లోకేశ్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్‌ కానుక వెనుక లాజిక్‌ ఏంటి? ఏపీలో రాజకీయ తుఫాన్‌కు ముందస్తు హెచ్చరికలా!

అన్న జగన్‌తో షర్మిలకు విభేదాలు ఉన్నట్లు చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. జగన్ సీఎం అయ్యాక.. షర్మిలతో ఒక్కసారి కూడా కలిసినట్లు ఎక్కడా కనిపించలేదు.

YS Sharmila : సందేశాల్లో రాజకీయ సందేశాలు వేరుగా ఉంటాయి. చెప్పదలుచుకున్నది డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా చెప్పడం మన రాజకీయ నేతలకు అలవాటే. మహానుభావులు ఊరికే రారు అన్నట్లుగా రాజకీయ నాయకులు ఊరికే ఏమీ చెయ్యరు. చేసే ప్రతీ పని వెనుక ఏదో ఒక మర్మం ఉంటుంది. సీఎం జగన్, టీడీపీ యువనేత నారా లోకేశ్ మధ్య రాజకీయ వైరం స్థాయి దాటి వ్యక్తిగత వైరంగా మారిన సమయంలో చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ కానుకలు పంపడం ఏ బేస్డ్ 2024 అనడం రాజకీయ సంచలనంగా మారింది. షర్మిల పంపిన క్రిస్మస్ గిఫ్ట్ లు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయి? ఎలాంటి రాజకీయ సందేహాలకు తెరలేపుతున్నాయి? లోకేశ్ లో సోదరుడిని చూసుకుంటున్న షర్మిల బాణం గురి మారిందా?

షర్మిల.. మస్త్ రాజకీయం
శత్రువుకు శత్రువు మిత్రుడు.. అంతేకాదు రాజకీయాల్లో శాశ్వత శత్రువులూ ఉండరు.. శాశ్వత మిత్రులూ ఉండరు..! ఈ రెండింట్లో ఏది అనుసరిస్తున్నారో తెలియదు కాని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల… మస్త్ రాజకీయం మొదలుపెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించిన షర్మిల ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌పై లుక్కేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లిన షర్మిల ఎన్నికల్లో హస్తం పార్టీకి భేషరతు మద్దతిచ్చారు.

దశాబ్దాల రాజకీయ వైరానికి ఫుల్‌స్టాప్ పెడుతూ..
కాంగ్రెస్ ఇచ్చిన మిస్డ్ కాల్‌తో ఆ పార్టీకి కనెక్ట్ అయిన షర్మిల.. ఏపీలో కాల్స్ ఏవీ లేకుండా ఏకంగా గోల్‌కొట్టే ప్లాన్ వేస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబంతో వైఫై స్పీడ్‌లో కనెక్ట్ అయ్యారు. దశాబ్దాల రాజకీయ వైరానికి ఫుల్‌స్టాప్ పెడుతూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాటున పక్కా రాజకీయానికి తెరతీశారు. గతంలో ఎన్నడూ లేనట్లు.. ఎప్పుడూ లేనట్లు చంద్రబాబు ఫ్యామిలీకి క్రిస్మస్ గిఫ్ట్ పంపి అనేక సందేహాలకు తెరలేపారు షర్మిల.

Also Read : జగన్ సంచలన నిర్ణయాలు.. అసలు వ్యూహం ఏంటి? గెలుపుపై అంత ధీమా ఎలా?

చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్‌లు..
ఏపీలో చంద్రబాబు కుటుంబానికి.. వైఎస్ ఫ్యామిలీకి మధ్య దశాబ్దాల రాజకీయ వైరం ఉంది. ఒకప్పుడు చంద్రబాబు, వైఎస్ ఇద్దరూ మంచి స్నేహితులే. కానీ రాజకీయంగా ఆ ఇద్దరి మధ్య జరిగిన పోటీ అందరికీ తెలిసిందే. అదే వైరం కంటిన్యూ చేశారు వైఎస్ కుమారుడు జగన్. ఇప్పుడు జగన్, చంద్రబాబు మధ్య పాలిటిక్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ, జగన్ సోదరి షర్మిల.. చంద్రబాబు ఫ్యామిలీతో ఉన్న రాజకీయ వైరాన్ని పక్కన పెట్టేశారు. చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్‌లు పంపారు. అందుకు ప్రతిగా షర్మిలకు కృతజ్ఞతలు చెప్పారు లోకేశ్. ఇలా పండగ కానుకలు పంపడం కామనే అయినా.. షర్మిల.. చంద్రబాబు కుటుంబానికి కానుకలివ్వడమే టాక్ ఆఫ్ ఏపీగా మారిపోయింది.

షర్మిల కానుకల వెనుక రాజకీయ సందేశం..!
షర్మిల క్రిస్మస్ గిఫ్టులతో ఇప్పటికే వాడివేడిగా ఉన్న ఏపీ రాజకీయం మరింత హాట్ హాట్‌గా మారిపోయింది. తెలంగాణలో రాజకీయం చేద్దామని తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనానికి ప్రయత్నించారు షర్మిల. అయితే షర్మిల సేవలను ఏపీలో వాడుకోవాలని కాంగ్రెస్ ఆలోచించింది. ఈ విషయంలో షర్మిల ఆలోచన ఏంటో ఇప్పటివరకు తెలియకపోయినా.. తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్.. ఏపీలో మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలంటే వైఎస్ ఫ్యామిలీతోనే ముందుకు వెళ్లాలని ఆలోచిస్తోందట.

ఏ కుటుంబంతో అయితే ఏపీలో కాంగ్రెస్ ఖతం అయ్యిందో అదే కుటుంబం నుంచి షర్మిలను రంగంలోకి దింపి ఏపీలో పార్టీకి జవసత్వాలు తేవాలనేది కాంగ్రెస్ ప్లాన్. ఈ ప్లాన్ వర్కౌవుట్ అవుతుందా.. లేదా.. అనేది పక్కనపెడితే.. షర్మిల క్రిస్మస్ గిఫ్ట్‌ల వెనుక సందేహం.. రాజకీయ సందేశాన్ని ఇస్తోందని అంటున్నారు పరిశీలకులు.

అప్పటి నుంచి రగిలిపోతున్న షర్మిల..
అన్న జగన్‌తో షర్మిలకు విభేదాలు ఉన్నట్లు చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. జగన్ సీఎం అయ్యాక.. షర్మిలతో ఒక్కసారి కూడా కలిసినట్లు ఎక్కడా కనిపించలేదు. పులివెందుల, ఇడుపులపాయ వెళ్లినప్పుడు కూడా అన్నాచెల్లెళ్లు ఎడముఖం.. పెడముఖమే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఇద్దరి మధ్య ఆస్తుల విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నట్లు ప్రచారం ఉంది. తెలంగాణలో తన రాజకీయ ఆకాంక్షలకు జగన్ సహకరించకపోగా… అప్పటి సీఎం కేసీఆర్ తనను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేసినప్పుడు.. కేసు పెట్టి జైలుకు పంపినప్పుడు కూడా సానుభూతి చూపలేదని షర్మిల రగిలిపోతున్నట్లు చెబుతున్నారు.

Also Read : ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ బిగ్ షాక్..! పీకేను దూరం చేసిన నారా లోకేశ్

షర్మిల.. చంద్రబాబు మద్దతు కోరుతున్నారా?
ఇంకా అంతకుమించి అన్నట్లు షర్మిల పార్టీకి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల బహిరంగంగా వ్యాఖ్యానించడం కూడా జగన్.. షర్మిల మధ్య గ్యాప్ ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఈ పరిస్థితుల్లో తనకు రాజకీయంగా అండదండ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న షర్మిల… చంద్రబాబు మద్దతు కోరుతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

పండగ కానుకలు.. శాంతి సందేశాలా? రాజకీయ సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలా?
ఇక షర్మిల గిఫ్ట్ ఒక్కటే కాదు.. అంతకుముందు రోజు రాజకీయ వ్యూహకర్త పీకే వచ్చి చంద్రబాబును కలవడం కూడా రాజకీయంగా ఏపీలో అగ్గి రాజేసింది. వైసీపీ.. టీడీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

పీకే కనుక వైసీపీ నేతలు విమర్శల దాడి చేయగలిగారని.. కానీ షర్మిల, లోకేశ్ మధ్య చాటింగ్‌పై చడీచప్పుడు చేయకపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ పండగ కానుకలు.. శాంతి సందేశాలా… రాజకీయ సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలా అన్నది తేలాల్సి ఉంది. ఏదిఏమైనా క్రిస్మస్ సంబరాల్లో షర్మిల మార్కు వ్యూహం మాత్రం టాక్ ఆఫ్ ద పాలిటిక్స్.. మంచి కిక్ ఇచ్చే మాస్‌ మూవీని మించిన ట్విస్ట్ అంటున్నారు పరిశీలకులు.

 

ట్రెండింగ్ వార్తలు