MLC elections
అవి ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రమే ! ఐతే ఫలితాలు మాత్రం చాలా ఆసక్తి రేకెత్తిస్తున్నాయ్. ఈ ఎన్నికలను కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జనరల్ ఎలక్షన్ రేంజ్ ప్రచారం చేసింది. ఎట్టకేలకు పోలింగ్ ముగిసింది. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయ్. మూడు స్థానాల్లోనూ కూటమే పైచేయి సాధించబోతుందా.. కూటమి పార్టీల సర్వేలో ఏం తేలింది.. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయ్..
ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండగా.. సీపీఐ బరిలోకి దిగలేదు. సీపీఎం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ బరిలో ఉండగా.. ఆయన మీద సీపీఎం బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు పోటీ చేశారు. గత ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా లక్ష్మణరావు విజయం సాధించారు.
పోటీలో వీరు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానంలో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం, సీపీఎం అభ్యర్థిగా రాఘవులు పోటీ చేస్తున్నారు. ఇక పీఆర్టీయూ తరఫున మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు పోటీలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఏపీటీఎఫ్ నాయకుడు పాకలపాటి రఘువర్మ మీద.. సీపీఎం అభ్యర్థిగా విజయగౌరి పోటీ చేశారు. పోటీ స్ట్రాంగ్‌గానే ఉండడంతో.. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి కనిపిస్తోంది.
సాధారణ ఎన్నికలను మించి.. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల నుంచి టీడీపీ సీనియర్ నాయకులు బరిలో ఉండడం.. వైసీపీ పోరులో లేకపోవడంతో ఈ ఎన్నికల్లో విజయం తధ్యమని కూటమి నాయకులు లెక్కలు వేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు స్థానాల పరిధిలో 66శాతం.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపరిధిలో 59శాతం పోలింగ్ నమోదయింది.
ఇక ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 92శాతం పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాజీ మంత్రి ఆలపాటిలాంటి వాళ్లు పోటీలో ఉండడంతో.. ఏ చిన్న పొరపాటు జరగొద్దని కూటమి సర్కార్ డిసైడ్ అయింది. ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎమ్మెల్యేలు, కీలక నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఎప్పటికప్పుడు ఓటర్లతో టచ్‌లో ఉంటూ.. ఆ నేతలంతా కూటమి పార్టీ కోసం ప్రచారం చేశారు.
వీరి మధ్య పోటీ
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్, లక్ష్మణరావు మధ్యే పోటీ కనిపించగా.. ఉభయగోదావరి జిల్లాల ఎన్నికల్లో రఘువర్మ, శ్రీనివాసులు నాయుడు మధ్యే పోటీ నడిచిందనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో తము మద్దతు తెలిపిన రఘువర్మ విజయం తధ్యం అని కూటమి పార్టీలు తమ సర్వేతో ఓ అంచనాకు వచ్చాయ్. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం టఫ్ ఫైట్ నడిచింది.
స్వతంత్రులు ఎక్కువగా ఉండడం, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు బరిలో నిలబడడంతో.. ఇక్కడ గెలుపుపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఇక, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం కూటమి తరఫున బరిలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం ఖాయంగా తెలుస్తోంది. ఐతే అసలు ఫలితాలు ఏంటన్నది మాత్రం మార్చి 3నే తేలనున్నాయ్.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడంపోవడంతో.. కూటమి అభ్యర్థులకు అవకాశాలు కలిసొచ్చాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఐతే ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి సర్కార్‌కు చాలా కీలకం. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయ్. దీంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయ్. దీంతో ఫలితాలపై జనాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది.