ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రయాణాలు మొదలవుతాయా…? ఇక్కడి ప్రజలు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి రావచ్చా…? రెండు రాష్ట్రాల మధ్య బస్సులు మళ్లీ ఎప్పుడు తిరుగుతాయి…? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 5 2020, జూన్ 01వ తేదీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది.
పలు రాష్ట్రాలు కూడా అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతిస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలను ఇంకా సడలించలేదు. సరిహద్దుల్లో ప్రస్తుతానికి ఆంక్షలు కొనసాగుతాయని ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రావాలనుకున్నవారు స్పందన పోర్టల్‌లో పాస్ తీసుకోవాలని సూచించారు.
పాసులు తీసుకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి సరిహద్దు చెక్‌పోస్టుల వద్దనే కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పరీక్షలకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలు సహకరించాలని ఆరోగ్యశాఖ కోరింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారు వారం రోజుల ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. వైరస్ ఉధృతి కాస్త తక్కువ ఉండే రాష్ట్రాల నుంచి వచ్చేవారు మాత్రం హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ 2020, జూన్ 01వ తేదీ సోమవారం అధికారులతో జరిపే సమీక్షలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను అనుమతించాలా లేదా అన్నదానిపై క్లారిటీ రానుంది. 2020, మే 31వ తేదీ ఆదివారం అధికారులతో జరిపిన సమీక్షలో పలు జిల్లాల కలెక్టర్లు అంతర్‌రాష్ట్ర ప్రయాణాలకు అనుమతిస్తేనే మంచిదని సూచించారు.
ఏపీ ప్రభుత్వం కూడా అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతిచ్చినప్పటికీ…బస్సులు తిరగడానికి మాత్రం మరికొంతకాలం పట్టే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రయాణాలకు అనుమతిచ్చినా బస్సులు ఎప్పట్నుంచి తిరుగుతాయన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. మరో వారం తర్వాతే బస్సు సర్వీసులు తిప్పుతారని సమాచారం. ఏపీ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. ఇప్పటికే విమానాలు, రైళ్లలో వచ్చేవారి సంఖ్య అధికంగా ఉంది.
వీరికి పరీక్షలు, క్వారంటైన్ చేయడం భారంగా ఉంది. ఇప్పుడు బస్సులు వదిలితే వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తారని వారందరికీ పరీక్షలు చేయడం, క్వారంటైన్ అమలు కూడా కష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగని వారిని ఎక్కువ కాలం ఆపలేమని కాబట్టి మరో వారం తర్వాత దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేసుకుని బస్సులు నడపాలని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఎప్పుడు తిరుగుతాయనే దానిపై మరో ఒకటి రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.