రాజమండ్రి రూరల్‌లో టీడీపీ హాట్రిక్కా.. వైసీపీ సంచలనమా?

ఇద్దరు నేతల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తున్న రాజమండ్రి రూరల్‌లో విజయం ఎవరిని వరిస్తుందునేది ఉత్కంఠ రేపుతోంది.

Rajahmundry Rural Assembly Constituency: రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన నేత ఒకరు. అధినేత అశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవిని చేపట్టి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నేత మరొకరు. ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరుకు వేదికవుతోంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. రాష్ట్రంలోనే హాట్ సీట్లలో ఒకటిగా నిలుస్తున్న రాజమండ్రి రూరల్‌లో గెలిచేది ఎవరు? ఇద్దరి నేతల వ్యూహాలు ఎలా ఉన్నాయి.

వ్యూహం మార్చిన అధికార పార్టీ
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన రాజమండ్రిలో 2009లో రూరల్ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి టీడీపీయే గెలిచింది. 2009లో చందన రమేశ్ గెలుపొందగా, గత రెండు ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరినే విజయం వరించింది. రాజమండ్రి నగరంలోని కొంత ప్రాంతంతోపాటు రాజమండ్రి రూరల్, కడియం మండలాలతో ఏర్పడిన ఈ నియోజవర్గంలో ఎక్కువగా బీసీ, కాపు ఓటర్ల ఆధిపత్యం ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం ప్రభావం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది. గత రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరికి ప్రత్యర్థిగా ఆకుల వీర్రాజు పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈ ఎన్నికల్లో వ్యూహం మార్చింది అధికార పార్టీ. బీసీ వర్గానికి చెందిన మంత్రి వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి తీసుకువచ్చింది. రాజమండ్రి రూరల్ ఇన్‌చార్జిగా వేణు బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు.

అతి తక్కువ సమయంలోనే అవగాహన
బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుని రాజమండ్రి రూరల్ నుంచి పోటీకి దింపితే కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉందని లెక్కలు వేస్తోంది వైసీపీ. ఆ పార్టీ చేయించిన సర్వేల్లోనూ ఇదే తేలడంతో వేణుని రూరల్ అభ్యర్థిగా మూడు నెలల క్రితమే డిసైడ్ చేశారు సీఎం జగన్. ఇంతవరకు రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వేణు సీఎం ఆదేశాలతో రామచంద్రపురం నుండి రాజమండ్రికి తన నివాసం మార్చుకున్నారు.. నియోజకవర్గంలో పరిస్థితులపైనా, రాజకీయ పరిణామాలపైనా అతి తక్కువ సమయంలోనే అవగాహన తెచ్చుకున్నారు మంత్రి వేణు.. నియోజవర్గ సమస్యలపై విశ్లేషణ చేసి పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. క్యాడర్ను ఒక తాటిపైకి తీసుకువచ్చారు. పార్టీని బలోపేతం చేసే విధంగా సమావేశాలు నిర్వహించి పార్టీ బలంతోపాటు తన బలాన్ని పెంచుకున్నారు.. కుటుంబంలో ఒక్కరిని మీ వేణు అనే నినాదంతో ప్రజలకు దగ్గరయ్యారు మంత్రి.. మరోవైపు కడియం మండలంలో మాజీ మంత్రి జక్కంపూడి కుటుంబానికి ఉన్న పట్టుతో అక్కడా తన ప్రభావం పెంచుకుంటున్నారు మంత్రి వేణు.

జక్కంపూడి సొంత మనిషిలా.. 
జక్కంపూడి రామ్మోహన్‌రావుకు అత్యంత సన్నిహితుడైన వేణుని సొంత మనిషిలా భావిస్తుండటంతో బీసీ సామాజిక వర్గంతోపాటు కాపుల్లోనూ బలం పెరిగిందంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే కడియం రైతుల కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని హామీనిచ్చారు.. గత ఇన్‌చార్జికి వైసిపి క్యాడర్కి మధ్య ఉన్న సమస్యలను తీర్చి క్యాడర్ మొత్తాన్ని యాక్టివ్ చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.. ఇక మంత్రి కుటుంబం మొత్తం రాజమండ్రి రూరల్‌లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడంతో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి అంత ఈజీ కాదు..
ఇక మంత్రి వేణుకి ప్రత్యర్థిగా పోటీచేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి అంత ఈజీ కాదంటున్నారు పరిశీలకులు. వరుసగా రెండుసార్లు గెలవడం, పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటంతో సహజ వ్యతిరేకత వల్ల ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి పరిస్థితులు అంత సానుకూలంగా లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం.. రాజకీయ చతురత కలిగిన నాయకుడిగా మంచి పేరే ఉన్న బుచ్చయ్యచౌదరిని ఢీకొట్టే నాయకుడే లేడని నిన్నమొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ, రాష్ట్ర రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి నియోజకవర్గ ప్రజలకి కొంచెం దూరమయ్యారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత మూడేళ్లుగా నియోజవర్గంలో పెద్దగా కనిపించలేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు టిడిపి-జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానంపై పెద్ద దుమారమే చలరేగింది. కొన్నివర్గాలు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేసే వరకు వచ్చింది. ఇది ఒక సామాజిక వర్గానికి అసంతృప్తికి గురిచేసిందనే ప్రచారం జరుగుతోంది. ఏదిఎలా ఉన్నా గోరంట్ల మాత్రం తన కేడర్‌ణు ఆయుధంగా మార్చుకుని ఎన్నికల బరిలోకి విజయం సాధించేందుకు అడుగులు వేస్తారనడంలో సందేహమే లేదు.

Also Read: టీడీపీ థర్డ్ లిస్ట్‌లో ట్విస్ట్.. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధికి బాపట్ల టీడీపీ టికెట్

ఇలా ఇద్దరు నేతల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తున్న రాజమండ్రి రూరల్‌లో విజయం ఎవరిని వరిస్తుందునేది ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గానికి కొత్తగా వచ్చినా… అందరినీ కలుపుకుని వెళ్తున్న మంత్రి వేణు విక్టరీ సాధిస్తారా? లేక సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హ్యట్రిక్ సాధిస్తారా? అన్నది వేచిచూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు