పత్తికొండ పోటుగాడెవరు..ఫ్యాన్ గాలి వీచేనా!

పాలెగాళ్ల పురిటిగడ్డ పత్తికొండ అసెంబ్లీని కైవసం చేసుకునేందుకు.. అధికార, విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో పాగా వేసేందుకు వైసీపీ పావులు కదుపుతోందా? త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాను పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు? టీడీపీ మళ్లీ పట్టు నిలుపుకుంటుందా .. వైసీపీ జెండా పాతుతుందా? టీడీపీ ఏ విధమైన ప్లాన్ అమలుచేయనుందనేది ఇప్పుడు చూద్దాం.

కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో.. వైసీపీ విజయం సాధించింది. 1955లో ఏర్పాటైన పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పటికీ  కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు ఆరుసార్లు, టీడీపీ ఏడు పర్యాయాలు, సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరోకసారి విజయం సాధించాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో పత్తికొండ అసెంబ్లీలోకి వెల్దుర్తి, క్రిష్ణగిరి, డోన్‌ నియోజకవర్గంలోని మూడు గ్రామాలను తుగ్గలిలోకి కలిపారు. పత్తికొండ, మద్దికెర మండలాలు యథాతథంగా ఉన్నాయి.

 

పునర్విభజనలో భాగంగా డోన్‌ అసెంబ్లీ స్థానంలోని క్రిష్ణగిరి మండలాన్ని పత్తికొండలోకి చేర్చడంతో .. కేఈ  కుటుంబం 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి.. రెండు సార్లు విజయం సాధించింది. ఐదుసార్లు గెలిచిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డిని కాదని డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్‌కు 2009లో టికెట్ ఇచ్చింది టీడీపీ. దీంతో ఎస్వీ సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో కేఈ క్రిష్ణమూర్తి విజయం సాధించి.. డిప్యూటీ సీఎం అయ్యారు.

 

కేఈ కుటుంబానికి కంచుకోటైన పత్తికొండ నుంచి వచ్చే ఎన్నికల్లో కేఈ శ్యాంబాబును బరిలోకి దించాలని క్రిష్ణమూర్తి డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలతో ఇప్పటికే చర్చలు జరిపి.. శ్యాంబాబు గెలుపుకు కృషి చేయాలని కోరారు. అయితే వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో.. శ్యాంబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తుగ్గలిలో రాష్ట్ర శాలివాహన ఛైర్మన్ తుగ్గలి నాగేంద్రతో.. కేఈ కుటుంబానికి విభేదాలు తారాస్థాయికి చేరాయి. 

 

వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకులపాడు శ్రీదేవి.. నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా కేఈ కుటుంబాన్ని ఓడించాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు పత్తికొండలో సత్తా చాటేందుకు కాంగ్రెస్, సీపీఎం, జనసేన పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కసరత్తు ప్రారంభించాయి. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ పట్టు నిలుపుకుంటుందా ? కంచుకోటలో వైసీపీ జెండా పాతుతుందా అన్నది తేలాలంటే .. మరి కొంత కాలం ఆగాల్సిందే.