బీజేపీ, జనసేన రాష్ర్ట స్థాయిలో అవగాహనతో కలిసి పని చేస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీలు కలసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాయి. కింది స్థాయి కార్యకర్తలకు కూడా ఈ విషయం గురించి నేతలు వివరించారు. కాకపోతే విశాఖ జిల్లాలో ఎక్కడా జనసేన, బీజేపీ కేడర్ కలసి కార్యక్రమాలు నిర్వహిస్తునర్న దాఖలాలు లేవు.
2019 ఎన్నికల్లో గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, విశాఖ ఎంపీగా మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ బరిలో ఉండటం, మాజీ మంత్రి బాలరాజు, చింతలపూడి లాంటి నేతలు ఉండటంతో జనసేన చాలా బలంగా కనిపించింది. కానీ అధినేత వపన్‌తో సహా పోటీ చేసిన ఏ ఒక్కరూ విజయం సాధించకపోవడం, లక్ష్మీనారాయణ, బాలరాజు, చింతలపుడి లాంటి నేతలు పార్టీని వీడటంతో ఏదో నామమాత్రమపు కార్యక్రమాలే నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా వల్ల ప్రత్యక్షంగా ఎక్కడా కార్యక్రమాలు జరగకపోయినా అడపా దడపా ప్రెస్‌మీట్లను కూడా ఇరు పార్టీలు నేతలు విడివిడిగానే పెడుతున్నారు. విశాఖ నగరంలోనూ, అటు రూరల్ జిల్లాలో కూడా విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఎందుకు కలిసి పనిచేయడం లేదో :
విశాఖ నగరంలో అయితే సరే సరీ. బీజేపీ మాజీ శాసనసభా పక్షా నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ కలిసి ప్రెస్ మీట్లు పెడుతున్నా ఎక్కడా జనసేన నేతలు కనిపించడం లేదు. ఒక రకంగా ఇంత వరకూ రెండు పార్టీల నేతలు కలిసి ఆందోళనలు నిర్వహించిన దాఖలా కూడా లేదు.
జనసేన నుంచి ఆ పార్టీ పీఏసీ సభ్యుడు శివసాగర్, బొలిసెట్టి సత్యనారాయణ లాంటి నేతలు ఉన్నా వారు కూడా అడపా దడపా కార్యక్రమాలు విడిగానే నిర్వహిస్తున్నారు. ఒక రకంగా ఇటీవల ఈ నేతలు బయటకు వస్తున్నా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా కలిసి పని చేయడం లేదంటున్నారు. దీంతో ఆ పార్టీ నేతల్లోనే కాకుండా అసలు బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందా? లేదా అనేది కార్యకర్తలకు కూడా అర్ధం కావడం లేదట.
అటు బీజేపీ నేతలు కానీ ఇటు జనసేన నేతలు కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు తప్ప తాము ఎందుకు కలిసి పని చేయడం లేదో చెప్పడం లేదు. ఈ పొత్తు విషయంపై ఇరు పార్టీల కార్యకర్తలకు దిశానిర్దేశం చెస్తే కలసికట్టుగా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చెసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. ప్రస్తుతానికైతే విశాఖలో కనిపించని బీజేపీ, జనసేన పొత్తు కనిపించడం లేదు. ఎవరి కార్యక్రమాలు వారే చేసుకుంటున్నప్పుడు ఇక పొత్తు అనే పేరు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.