Chicken Price : కొండెక్కిన కోడి.. కారణం ఇదే!

శ్రావణమాసంలో కూడా చికెన్ ధరలు తగ్గడం లేదు. డిమాండ్ కి తగినంతగా సప్లై లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది

Chicken Price

Chicken Price : చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. శ్రావణమాసంలో డిమాండ్ తగ్గినా చికెన్ ధర మాత్రం తగ్గలేదు. రెండు నెలల వ్యవధిలో చికెన్ ధరలు రెండు నుంచి మూడు రేట్లు పెరిగాయి. గత నెలలో రూ.220 నుంచి రూ.250 మధ్య ఉన్న చికెన్ ధర ఆగస్టులో రూ.300కు చేరింది. శ్రావణమాసంలో డిమాండ్ తగ్గినప్పడికి ధర తగ్గకపోవడం మధ్యతరగతి వినియోగదారులకి భారంగా మారింది.

ధరలు తగ్గకపోవడానికి కారణం

కరోనా మొదటి వేవ్ లో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి. కేజీ రూ.20కి కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత వైద్యులు చికెన్ శక్తివంతమైన ఆహారం అని.. చికెన్ ద్వారా కరోనా రాదని తేల్చి చెప్పడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో దాణ రేట్లు అమాంతం పెరిగాయి. కోడికి వేసే దానాల్లో ప్రధానంగా సొయా, మొక్కజొన్న ఉంటుంది. కరోనాకి ముందు కేజీ సొయా రూ.35 కి లభించేది.. కానీ ప్రస్తుతం కేజీ సొయా రూ.105గా ఉంది. ఇక రూ.12, 13 రూపాయలకు లభించే కేజీ మొక్కజొన్న దాన ఇప్పుడు రూ .23 కి చేరింది. దీంతో ఉత్పత్తి భారం భారీగా పెరిగింది. దీంతో బ్యాచ్ వేయడమే మానేశారు కోళ్లపెంపకం దారులు. దీంతో కేజీ చికెన్ రూ.300 చేరింది.

ఈ నేపథ్యంలోనే చాలామంది కోళ్ల పెంపకం నిలిపివేశారు. దీంతో శ్రావణమాసంలో ఉండే డిమాండ్ కి తగినట్లు ఉత్పత్తి లేదు. కోళ్లను వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రవాణా చార్జీలు, లేబర్ చార్జీలు పెరిగిపోవడంతో కోడి ధర కొండెక్కి కూర్చుంది. కోళ్ల ధరలు పెరిగినా, గుడ్డు ధరలు మాత్రం అదుపులోనే ఉన్నాయి. కోడిగుడ్డు రూ.5కే లభిస్తుంది.