తెలంగాణ కాంగ్రెస్‌లో ఆల్ ఆఫ్ సడెన్ డెవలప్‌మెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న దీపాదాస్ మున్షీని ఓవర్ నైట్ తప్పించింది అధిష్టానం. దాదాపు ఏడాదికిపైగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్న దీపాదాస్ స్థానంలో మీనాక్షి నటరాజ్‌ను నియమించారు ఢిల్లీ పెద్దలు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారట.
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కొంతమంది అధికారులు కూడా రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నారన్న గుసగుసలు గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయి. దీపాదాస్ మున్షీ వ్యవహరంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారని అందుకే ఆమెను తప్పించారని ప్రచారం జరుగుతోంది.
ఫెయిల్ అయ్యారా?
పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో దీపాదాస్ ఫెయిల్ అయ్యారని విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీలో సీనియర్లను ఏ మాత్రం పట్టించుకోకుండా తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని దీపాదాస్ మున్షీ ఏకపక్షంగా వ్యవహరించారని నేతలు గుర్రుగా ఉన్నారట. ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారితో కూడా దీపాదాస్‌కు ఏ మాత్రం కోఆర్డినేషన్ లేదని చెబుతున్నారు.
ఇదంతా ఒకఎత్తు అయితే దీపాదాస్ మున్షీ ప్రభుత్వ వ్యవహారాల్లోనూ అతిగా జోక్యం చేసుకునేవారని సెక్రటేరియట్ వర్గాల టాక్. నేరుగా ఐఏఎస్ అధికారులకు ఫోన్ చేసేవారని, కొంత మంది అధికారులను తన దగ్గరకు పిలిపించుకుని మరీ పనులు చేయించుకున్నారని గుసగుసలు వినిపించాయి. అయితే ఈ ప్రచారమంతా ఉట్టిదే అన్నట్లుగా సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కొట్టి పడేస్తున్నారు. దీపాదాస్ బాగా పని చేశారంటూ..విమర్శలకు ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ నియామకం కూడా తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాశమవుతోంది. మీనాక్షి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కోటరీలో అతి ముఖ్యమైన లీడర్. ఇంకా చెప్పాలంటే రాహుల్ టీమ్‌లోని పది మందిలో మీనాక్షి ఒకరని చెప్తుంటారు.
జోడోయాత్రలో మీనాక్షి కీలక పాత్ర
రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారత్ జోడోయాత్రలో మీనాక్షి కీలక పాత్ర పోషించారు. రాహుల్‌కు అత్యంత నమ్మకమైన నాయకురాలైన మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా పంపించడం వెనుక ఆంతర్యం వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై రాహుల్‌గాంధీ అంతగా సంతృప్తిగా లేరట. తెలంగాణలో ప్రభుత్వానికి, పార్టీకి ఏ మాత్రం సమన్వయం లేదని రాహుల్ సహా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది.
ఏఐసీసీ ప్రధాన కార్యకర్శి కేసీ వేణుగోపాల్ నేరుగా ఈ విషయాన్ని సీఎం రేవంత్ సహా మంత్రులకు వివరించినట్లు సమాచారం. అంతేకాదు ఒకటి రెండుసార్లు మంత్రుల తీరును మార్చుకోవాలని, అహంకారం ప్రదర్శించొద్దని కూడా హెచ్చరించినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయినా మంత్రులు, కొంతమంది పార్టీ నేతల తీరు మారలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై రాహుల్‌గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
అందులో భాగంగానే ఆయన టీమ్‌లోని కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్‌ను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా నియమించారన్న టాక్ వినిపిస్తోంది. ఇకపై అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేయడంతో పాటు అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో మీనాక్షి కీలక పాత్ర పోషించబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఇంచార్జ్ రాకతో అయినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, సర్కార్‌కు మధ్య కోఆర్డినేషన్ సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి మరి.