కేజ్రీ గెలుపుతో జగన్‌ ఫుల్ ఖుషీ! 

  • Publish Date - February 13, 2020 / 10:18 AM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జగన్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారట. ఈ ఫలితాలు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు ఊరటనిచ్చాయని అంటున్నారు. అదే సమయంలో జగన్‌ మాత్రం ఫుల్‌ జోష్‌ మీద ఉన్నారని చెబుతున్నారు. దీని వెనుక అసలు కారణం ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలేనంట. రాజ్యసభలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్న స్ధానాలను ఎలాగైనా గెల్చుకుని మెజారిటీ అందుకోవాలని బీజేపీ భావించింది. ఇందుకు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు హెల్ప్‌ అవుతాయని అనుకుంది. కానీ, అక్కడి ఫలితాలు కోలుకోలేని విధంగా దెబ్బ తీశాయి. రాజ్యసభలో మెజారిటీ కోసం తమపై ఆధారపడాలని వైసీపీ, టీఆర్ఎస్, జేడీయూ, బీజేడీ, ఆర్జేడీ లాంటి ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే జగన్‌ ఈ విషయంపై లోలోపల సంబరపడిపోతున్నారట. 

రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని :
రాజ్యసభలో మెజారిటీ కోసం బీజేపీ ఆధారపడుతున్న వైసీపీ, అన్నాడీఎంకే, బీజేడీ వంటి పార్టీలకు ఈ విజయం ఊరటేనని అంటున్నారు. రాష్ట్రంలో తాము అనుకున్నవి సాధించుకోవాలంటే రాజ్యసభలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉండకూడదు. ప్రస్తుతం రాజ్యసభలో ఆ పార్టీకి ఆశించిన మెజారిటీ లేదు. ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా ఇతర పక్షాలపై ఆధారపడాల్సిందే. ఇప్పుడు ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల్లో వైసీపీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు తమ స్థానాలను పెంచుకోవడం ఖాయం. రాజ్యసభలో తమకున్న స్ధానాలపై ఆధారపడుతున్న బీజేపీ… ఇక నుంచి కాస్తో కూస్తో ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రంపై కనికరం చూపిస్తుందనే కారణంతోనే జగన్‌ ఆనందంగా ఉన్నారంటున్నారు. 

ఆ నాలుగు స్థానాలు వైసీపీకే? :
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉంటే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో తగిన స్ధానాలు సాధించి ఎగువసభలో మెజారిటీ అందుకునే అవకాశాలు మెరుగుపడేవి. అప్పుడు ప్రాంతీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎన్డీయే ప్రభుత్వం ఏకపక్షంగా మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముండేది. కానీ, ఢిల్లీలో ఆప్‌ గెలుపుతో బీజేపీకి ఆ చాన్స్‌ లేకుండా పోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా నాలుగు స్ధానాలు గెల్చుకునే అవకాశం దక్కింది.

అదే సమయంలో అన్నా డీఎంకేతో పాటు బీజేడీ వంటి పార్టీలు సైతం ఆయా రాష్ట్రాల్లో తమకున్న అసెంబ్లీ స్ధానాల ఆధారంగా ఖాళీ అయ్యే ఎంపీ సీట్లు గెల్చుకుని రాజ్యసభలో మరింత బలపడే అవకాశముంది. ఢిల్లీలో ఓడిపోవడంతో ఇప్పుడు పరిస్థితులను తమకు అనువుగా మార్చుకోవచ్చని జగన్‌ ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీజేపీ… కనీసం ఢిల్లీలోనైనా గెలిస్తే రాజ్యసభలో మెజార్టీకి చేరువగా వస్తుందని అంతా భావించారు.

కానీ ఆప్ విజయంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. ఢిల్లీ పరిణామాలు కచ్చితంగా తమకు మేలు చేసేవిగానే ఉంటాయని వైసీపీ అధిష్టానం అంచనా లెక్కలేస్తోంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇది తప్పకుండా ఉపకరిస్తుందని జగన్‌ భావిస్తున్నారట. అవకాశం చూసుకొని అడుగులు వేయాలనే ఉద్దేశంతోనే జగన్‌ ఉన్నారని చెబుతున్నారు.