Srikakulam Corporation : సిక్కోలు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగేనా.? 15ఏళ్ల తర్వాత అయినా పీటముడి వీడేనా.

Srikakulam Corporation : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తుల ప్రారంభించడంతో శ్రీకాకుళం జిల్లా కేంద్ర వాసులకు కూడా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Srikakulam Corporation

Srikakulam Corporation : శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు గ్రహణం పట్టుకుంది. 2005 వరకు సిక్కోలులో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి 2010తో మున్సిపల్ కౌన్సిల్ సమయం ముగిసిన నాటినుండి నేటి వరకు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగలేదు. 2015లో టీడీపీ హయాంలో ఏడు పంచాయతీలను శ్రీకాకుళం మున్సిపాలిటీలో కలిపి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. విలీనాన్ని వ్యతిరేకించిన పంచాయతీ గ్రామాల ప్రజలు కోర్టు మెట్లక్కడంతో.. సిక్కోలు కార్పొరేషన్‌కు పాలకులు లేకుండా పోయారు. 2005 ఎన్నికల తర్వాత దాదాపు 20 ఏళ్లకు పైగా ఎన్నికలు జరగకపోవడం 15 ఏళ్లుగా పాలకులు లేకపోవడం సిక్కోలు నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

Also Read : Priya Adhikari : నేపాల్ వరదల్లో ‘లేడీ పైలట్’ సాహసం.. ఆరు రోజుల్లో 100 రెస్క్యూ ఆపరేషన్లు.. ఎవరీ ప్రియా అధికారి..

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తుల ప్రారంభించడంతో శ్రీకాకుళం జిల్లా కేంద్ర వాసులకు కూడా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈసారి అయినా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే శ్రీకాకుళం కార్పొరేషన్‌ అభివృద్ధి బాటపడుతుందని కోటి ఆశలతో ఉన్నారు సిక్కోలు నగరవాసులు. శ్రీకాకుళం పట్టణంలో ఇప్పటికీ చాలారోడ్లు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఇక డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో చినుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు డ్రైనేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం కూడా మధ్యలోనే ఆగిపోవడంతో మురుగునీరు అంతా నాగావళి నదిలో కలుస్తుంది. దీంతో నాగవళి నది అంతా కాలుష్యంతో  నిండిపోయింది. వీటన్నింటికీ  చెక్ పెట్టాలంటే కార్పొరేషన్‌కు పాలకవర్గం ఉంటేనే ప్రజల కోసం సరైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు సిక్కోలు వాసులు.

ఓ వైపు ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం ముంచుకొస్తుండటం.. మరోవైపు కోర్టు కేసులు ఇంకా తేలకపోవడంతో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదోనన్న డైలమా కొనసాగుతోంది. సిక్కోలు కార్పొరేషన్‌ ఎన్నికలకు ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందో లేదోనని..అధికార ప్రతిపక్ష నేతలు అంతా మల్ల గుల్లాలు పడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోర్టు కేసులను వీలైనంత త్వరగా క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటుననారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం కార్పొరేషన్‌లో కలిపిన తోట పాలెం, కుశాలపురం గ్రామాలను తిరిగి ఎచ్చెర్ల మండలానికి అప్పగించాలని ఎచ్చెర్ల శాసనసభ్యుడు ఈశ్వరరావు కోరడం..శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అందుకు ఓకే చెప్పడంతో వివాదం సద్దుమణుగుతోందని భావిస్తున్నారు.

ఇక పొలిటికల్‌గా కూడా సిక్కోలు పాలిటిక్స్‌ వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోల్పోయినప్పటి నుంచి సైలెంట్‌ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఇప్పుడు చంద్రబాబును, లోకేశ్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు జరిగితే కార్పొరేషన్ మొదటి మేయర్‌గా పోటీ చేసేందుకు తమ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు చర్చ నడుస్తుంది. మరోవైపు గతంలో మున్సిపల్ ఛైర్మన్‌గా చేసిన అందవరపు కుటుంబం, అందవరపు జయంతి, ఆమె సోదరులు వైశ్యకార్డుతో లాబీయింగ్ చేస్తున్నారని టాక్.

ఈ సారి మేయర్‌కు డైరెక్ట్‌ ఎన్నిక జరగనుండటంతో చాలామంది ఆశావహులు తెరవెనుక ప్రయత్నాలు స్పీడప్ చేస్తున్నారట. ఇటు ఎమ్మెల్యే శంకర్, అటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడ్ను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట. సిక్కోలు నగరవాసులు మాత్రం ఎలాగైనా ఈసారి ఎన్నికలు జరగాలని.. నగరం అభివృద్ధి జరగాలని ఆశిస్తున్నారు. కోర్టు కేసులు, మిగతా అడ్డంకులు అన్ని దాటి ఎన్నికలు జరుగుతాయో లేదో చూడాలి మరి.