జగన్‌, మోడీ క్లియర్‌ చేస్తున్నారు రూటు! ఆ ఇద్దరి కోసమేనా?

  • Publish Date - February 15, 2020 / 12:17 PM IST

ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరికి కేంద్ర కేబినెట్‌లో చోటు ఇవ్వాలని.. కూటమిలో లేనివారికి కేబినెట్ లో చోటా? అని ఆశ్చర్య పడక్కర్లేదు. ఏ క్షణంలోనైనా కూటమిలో చేరిపోవచ్చు. వీరిలో ఇద్దరికి ఎందుకు మంత్రులు ఇవ్వాలి.. మీకో మంత్రి పదవులు.. నాకో రాజ్యసభ.. ఇంతా చెప్పాక కూడా ఇంకా అర్థం కాలేదా? వారెవరో.. అయితే ఈ స్టోరీ మీరు చదవాల్సిందే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏ ఇద్దరినీ కదిలించినా ఒకటే వినిపిస్తోంది.

వైసీపీ తొందర్లోనే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు ఇప్పించేందుకు ఈ ఇద్దరు సమావేశమయ్యారని అంటున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం హుటాహుటిన జగన్‌ హస్తినకు వెళ్లిన నేపథ్యంలో పలు రకాల ఊహాగానాలకు ఆస్కారమిచ్చింది. అన్ని వర్గాల్లోనూ ఇదే చర్చనీయాంశం అయ్యింది. ప్రధాని మోడీతో దాదాపు గంట పాటు జగన్‌ ఏకాంతంగా మాట్లాడారు. రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అంశాలే మాట్లాడుకున్నారని బయటకు చెబుతున్నా.. రాజకీయ కారణాలున్నాయని జనాలు అంటున్నారు.

అందుకే జగన్ ఢిల్లీ వెళ్లారా? :
జగన్‌ ఢిల్లీ టూర్‌లో భాగంగా నిజానికి ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్‌షాతో కూడా భేటీ కావలసి ఉంది. కానీ, అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. కొన్ని నెలలుగా ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం జగన్ ప్రయత్నిస్తున్నా సాధ్యం కాలేదు. వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారం, ఇతరత్రా కారణాలతో జగన్‌కు అపాయింట్‌మెంట్ వాయిదా వేస్తూ వచ్చిన బీజేపీ పెద్దలు.. ఢిల్లీ ఫలితాల నేపథ్యంలో హడావుడిగా అపాయింట్ మెంట్ ఖరారు చేశారట. జగన్ కూడా వెంటనే సిద్ధమై వెళ్లడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఈ మధ్య జాతీయ స్దాయిలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలతో కుదేలవుతున్న బీజేపీ పెద్దలు.. దక్షిణాదిన కీలకంగా ఉన్న వైసీపీ, డీఎంకే వంటి పార్టీలను కేబినెట్‌లోకి ఆహ్వానిస్తున్నారని అంటున్నారు.

వైసీపీ, డీఎంకేలను ఆహ్వానిస్తోందా? :
నిజానికి సార్వత్రిక ఎన్నికల తర్వాతే కేబినెట్‌లో చేరాలంటూ వైసీపీకి ఆహ్వానం అందింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు కోసం పోరాడుతున్నామని చెప్పిన వైసీపీ కేబినెట్‌లో చేరితే ప్రజల్లో రాంగ్‌ సిగ్నల్స్‌ వెళ్తాయన్న కారణంగా చేరలేదని అంటున్నారు.

అప్పట్లో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని సైతం ఎన్డీయే పెద్దలు వైసీపీకి ఆఫర్ చేశారు. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని సీఎం జగన్‌ వాయిదా వేస్తూ వస్తున్నారట. ప్రస్తుతం ఢిల్లీలో ఓటమి తర్వాత బీజేపీ అధిష్టానం కేబినెట్ విస్తరణ చేపట్టాలనే ఆలోచనలో ఉందంట. ఢిల్లీ ఓటమిని మరిపిస్తూ కేబినెట్‌లోకి దక్షిణాది పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా దేశవ్యాప్తంగా తాము బలంగానే ఉన్నామనే సంకేతాలివ్వాలని అనుకుంటోందని అంటున్నారు. అందుకే వైసీపీ, డీఎంకేలను ఆహ్వానిస్తోందట.

ఈ ఇద్దరికి ఛాన్స్ దక్కేనా? :
మరోపక్క, కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరితే.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి చాన్స్‌ తప్పకుండా ఇస్తారనే ప్రచారం మొదలైంది. ఆయనతో పాటు బాపట్ల ఎంపీ సురేశ్‌కు కూడా అవకాశం ఉండవచ్చని అంటున్నారు. సురేశ్‌ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎంపీ కావడంతో ఆ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందని వైసీపీ లెక్కలేస్తోందని చెబుతున్నారు.

దేశ‌ పరిపాలనా కేంద్రంగా ఉన్న ఢిల్లీలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ ఎంత ప్రయత్నించినా చిత్తు కాక తప్పలేదు. భవిష్యత్తులో ప్రధాని మోడీకి రాజ్యసభలో బలం అవసరం. కానీ, ఢిల్లీ ఫలితాలు నిరాశకు గురిచేశాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు దగ్గర కావలసిన అవసరం ఏర్పడింది. అందుకే వైసీపీని దగ్గరకు తీసుకుంటున్నారట.

అసలు బీజేపీ ప్లాన్ ఇదేనా? :
మోడీకి మిత్రులు, శత్రువులు ఉండరు. అవసరం మాత్రమే ఉంటుంది. తమ అవసరాల కోసం ఎవరితో అయినా కలుస్తారు. అందుకే వైసీపీతో పాటు తమిళనాడులో డీఎంకేను కూడా ఆహ్వానిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైసీపీకి కేబినెట్‌లో అవకాశం ఇవ్వాలని ఎన్డీయే డిసైడ్‌ అయ్యిందట. వైసీపీకి నాలుగు రాజ్యసభ స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉంది. సభలో ఎన్డీయేకు బలం తక్కువ ఉంది.

అందుకే బీజేపీ ఈ ప్లాన్‌ వేసిందంటున్నారు. నాలుగింటిలో ఒక స్థానాన్ని కూడా కోరే చాన్స్‌ ఉందంటున్నారు. వైసీపీ ఎన్డీఏలో చేరితే రెండు కేంద్రమంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ట. ఆ తర్వాత ఏప్రిల్‌లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటును బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని జనాలు చర్చించుకుంటున్నారు.

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు