జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సినిమాల పరంగా మాస్ ఫాలోయింగ్ ఎక్కువే. రాజకీయాల్లో మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయన సభలకు వేలాదిగా జనం వస్తుంటారు. ఈ ఫాలోయింగ్‌ని వాడుకోవాలని తద్వారా బీజేపీ విధానాలను జనంలోకి తీసుకువెళ్లాలనేది పార్టీ జాతీయ నాయకత్వం ప్లాన్. ఇదే విషయం తెలుగు రాష్ట్రాల బీజేపీ శ్రేణులకు సూచించారట బీజేపీ జాతీయ నేతలు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే రాజధాని అంశంపై జనసేనతో కలసి పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది బీజేపీ. తెలంగాణలో సైతం పవన్‌తో కలిసి పని చేస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేనాని సేవల వినియోగంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్‌తో కలిసి పోరాటాలు చేయడం వల్ల తెలంగాణ బీజేపీకి దీర్ఘకాలంలో నష్టం ఉంటుందని అంటున్నారు కొంతమంది నేతలు.
కొత్త ఇబ్బందులు తప్పవా? :
ఎవరు అవునన్నా.. కాదన్నా తెలంగాణ సెంటిమెంట్ ఇంకా జనంలో ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రా లీడర్ వచ్చి టీఆర్ఎస్‌ను గానీ కేసీఆర్‌ను గానీ విమర్శిస్తే మొదటికే మోసం వస్తుందనేది కొంతమంది నేతల వాదన. ప్రస్తుతం బీజేపీ రెండు కార్యక్రమాలను చేపట్టింది. సీఏఏను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, తెలంగాణ ప్రభుత్వ పనితీరు, పథకాలను నిశితంగా పరిశీలిస్తూ లోపాలను ఎండగట్టడం.
ఈ రెండు కార్యక్రమాల్లో పవన్‌ను పాల్గొనేలా చేస్తే కొత్త ఇబ్బందులు తప్పవని బీజేపీలో కొందరు చెబుతున్నారట. మరోవైపు పవన్‌ను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావడం వల్ల జాతీయ స్థాయి నేతలైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుల ప్రభావాన్ని తగ్గించిన వారమవుతామని అంటున్నారంట.
పవన్‌ను దూరంగా ఉంచితేనే మంచిది :
ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కల్యాణ్‌ను దూరంగా ఉంచితేనే మంచిదని సలహాలిస్తున్నారని చెబుతున్నారు. ఇందుకు వివిధ కారణాలను తెర మీదకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వల్లనే కాంగ్రెస్ నష్టపోయిందని, ఇప్పుడు పవన్‌తో కలిసి వెళ్తే అదే పరిస్థితి బీజేపీకి ఎదురవుతుందని గుర్తు చేస్తున్నారట.
భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ సేవలను తెలంగాణ బీజేపీ వినియోగించుకుంటుందా? కొత్త తలనొప్పులు ఎందుకు అని వదిలేస్తుందా అన్నది కాలమే నిర్ణయిస్తుందని జనాలు అంటున్నారు.
Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు