కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ నేతల ప్రశంసలు.. రాజధాని అమరావతి పనులు పరుగులు పెడతాయని..

ఏపీ ఏం ఆశించిందో వాటిని బడ్జెట్‌లో కేంద్రం పొందుపర్చడం సంతోషదాయకమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

yanamala ramakrishnudu and Atchen Naidu comments on Union Budget 2024

Yanamala ramakrishnudu on Union Budget 2024: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. తమ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడంపై సంతోషం ప్రకటించింది. ఏపీ ఏం ఆశించిందో వాటిని కేంద్రం బడ్జెట్‌లో పొందుపర్చడం సంతోషదాయకమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెట్టించవచ్చని అన్నారు.

”పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరోసారి స్పష్టంగా హామీ ఇవ్వడం శుభ పరిణామం. ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాలకు నిధులిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతుంది. ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి కేంద్రం ప్రకటన ఆర్థిక తోడ్పాటు ఇస్తుంది.. ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. ఏపీలో పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సాధ్యపడుతుంది. కేంద్ర బడ్జెట్ కేటాయింపులతో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయి. స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు పడడానికి కేంద్ర బడ్జెట్ ఉపకరిస్తుంది.

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఫలించాయి. ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర పథకాలు ఊతమిస్తాయి. గత ఐదేళ్లల్లో జగన్ రుణాలే తెచ్చారు.. మేం నిధులు తెస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అమరావతిని, పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది. మేం రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ పనులను గాడిలో పెడుతున్నామ”ని యనమల రామకృష్ణుడు అన్నారు.

Also Read : కేంద్ర బడ్జెట్‌ 2024లో ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్.. తెలంగాణకు నిరాశ

నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్లు కేటాయించిన NDA ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు