Ycp Mla Maddishetti Venugopal Interesting Remarks On The Pending Bills
YCP MLA Maddishetti Venugopal interesting remarks on the pending bills : ప్రకాశం జిల్లా ప్లీనరీలో వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కార్యకర్తలను అప్పులపాలు చేశానని వారిని ఆదుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని అన్నారు. నా నియోజకవర్గంలో పనులను వైసీపీ కార్యకర్తలకు అప్పగించానని దీంతో వారు అప్పుల పాలు అయ్యారని పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారిని పార్టీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శి నియోజకవర్గంలో పనులు చేసిన కార్యకర్తలకు రూ.100కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి కార్యకర్తలకు రావాల్సిన పేరుకుపోయిన బిల్లులు మంజూరు చేయాలని సూచించారు. లబ్దిదారులకు సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు వేయటం వల్ల..ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగటంలేదని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటువంటి ఇబ్బందులు..బాధలు ఒక్క దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టికే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలామందికే ఉంది. గతంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సైతం ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల విషయంలో సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు చేసిన వారికి బిల్లులు రావడం లేదని… ప్రతిష్టకు పోయి పనులు చేసిన పార్టీలోని దిగువ స్థాయి నేతలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో మీడియా సమావేశం పెట్టిన ధర్మాన ప్రసాదరావు బిల్లులు ఆలస్యం కావడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కింది స్థాయి నేతలు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటీసీలు ప్రతిష్టకు పోయి పనులు ప్రారంభించారని కానీ ఇప్పుడు వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని అన్నారు.ఇటువంటి విషయాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దృష్టికి తీసుకెళ్లానని ఆయినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు.
కాగా..మద్దిశెట్టి వేణుగోపాల్ 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత వైసీపీలో చేరారు. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావుపై గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీ లోకి అడుగుపెట్టారు.