రాజధాని ఫైట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులు వద్దు..ఒక్క రాజధానే ముద్దు అంటూ రాజధాని ప్రాంతాల వాసులు ఇంకా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీయైన టీడీపీ ఆందోళనలు, నిరసనల్లో పాల్గొంటోంది. ఇదిలా ఉంటే..టిడిపి అధినేత చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లె… వైసీపీ బహిరంగ సభకు వేదిక కావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. ఇది రాజకీయ సభ కాదని… తొలి సభ నారావారిపల్లెలో నిర్వహించడం వెనక రాజకీయ కారణం కూడా లేదన్నారు. చంద్రబాబు సొంత గ్రామంలోనే వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహిస్తుండడం టిడీపి నేతలకు చిర్రెత్తుకొచ్చింది. వైసిపి సభకు పోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక టిడిపి నేతలు సమాయత్తమయ్యారు.
అమరావతి రైతులకు మద్దతుగా నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు నిరసన కార్యక్రమానికి అనుమతి కోసం చంద్రగిరి పోలీసుల్ని అభ్యర్థించారు. చంద్రబాబు స్వగ్రామంలో వైసీపీ సభ పెట్టడాన్ని ప్రభుత్వం చేస్తున్న దాడిగా భావిస్తామని టీడీపీ నేతలంటున్నారు. చంద్రబాబుని రెచ్చగొట్టడానికి.. చులకన చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు టీడీపీ నేతల నిరసన కార్యక్రమాలకు చంద్రగిరి పోలీసుల నుంచి అనుమతి రాలేదు. అయితే పోలీసు శాఖ పర్మిషన్ ఇవ్వకపోయినా తమ నిరసనలు కొనసాగిస్తామని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. దీంతో నారావారిపల్లెలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Read More : ఇంటి వద్దకే ఫించన్లు : గ్రాండ్ సక్సెస్..తొలి రోజే చరిత్ర