కరోనా కష్టకాలం.. ఎందరో జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది. వైరస్ సోకి కొందరు కన్నుమూస్తుంటే …ఆర్ధిక నష్టాలు తట్టుకోలేక మరి కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో వ్యాపారంలో నష్టాలు రావటంతో అనంతపురం ధర్మవరం కు చెందిన వ్యాపారస్తుడు 3 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా…ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది శ్రీకాకుళంజిల్లాకు చెందిన మరో యువకుడు ప్రాణం తీసుకున్నాడు.
రాజాం పట్టణానికి చెందిన బొమ్మన మధు అనే యువకుడు (30) ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయసాగాడు. ఇటీవల కరోనా లాక్ డౌన్ సమయంలో చేస్తున్న ఉద్యోగం వదిలి పెట్టి ఇంటికి వచ్చాడు. అన్ లాక్ ప్రక్రియ మొదలెట్టాక మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేయ సాగాడు.
కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంట్లో వృధ్దులైన తల్లితండ్రులకుతాను భారంగా మారానని మనో వ్యధకు గురవ్వసాగాడు. తాను ఖాళీగా ఇంటి వద్ద ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో ఆగస్టు3, సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
గమనించిన తల్లితండ్రులు వెంటనే రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం ప్రభుత్సాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు.