సంఖ్యా బలం లేదని తెలిసినా టీడీపీ పోటీకి దిగుతోంది: జగన్ విమర్శలు

కాంగ్రెస్‌ నుంచి తాను బయటకు వచ్చినప్పుడు తాను, అమ్మ మాత్రమే బయటకు వచ్చామని చెప్పారు.

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ తిరుగులేని మెజార్టీలు సాధించిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యా బలం లేదని తెలిపారు.

నైతిక విలువలు పాటిస్తే గనుక ఆ పార్టీ పోటీ పెట్టకూడదని చెప్పారు. సంఖ్యా బలం లేదని తెలిసినా టీడీపీ పోటీకి దిగుతోందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నారని అన్నారు. అధర్మ యుద్ధంచేసే ప్రయత్నం చేస్తున్నారని, డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఒక నాయకుడు ఎదగాలన్నా, పెరగాలన్నా రెండు దారులు కనిపిస్తాయని, ఒక దారి సులభంగా ఉంటుందని,కాని రెండో దారి కష్టంతో కూడుకుని ఉంటుందని తెలిపారు. కష్టమైనా విలువలు, విశ్వసనీయతతో, వ్యక్తిత్వ విలువలతోకూడిన దారి శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. తన జీవితంలో తాను విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.

కాంగ్రెస్‌ నుంచి తాను బయటకు వచ్చినప్పుడు తాను, అమ్మ మాత్రమే బయటకు వచ్చామని జగన్ వ్యాఖ్యానించారు. తనతో వచ్చేవాళ్లు రాజీనామాలు చేసి వచ్చారని తెలిపారు. ఇద్దరితో మొదలైన పార్టీ పెద్ద స్థాయికి చేరుకుందని అన్నారు. బొత్స సత్యనారాయణ ను గెలిపించాలని కోరారు. తమకు 600కు పైగా ఓట్లు ఉన్నాయని, టీడీపీకి కేవలం 200 ఓట్లకు పైన ఉన్నాయని చెప్పారు.

Also Read: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనితను కలిసిన వైఎస్ సునీత.. వారిపై చర్యలు తీసుకోవాలని విన్నపం

ట్రెండింగ్ వార్తలు