YS Jagan : ఫస్ట్ ర్యాంక్ నవీన్ లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారు..? చంద్రబాబు, లోకేశ్‌కు డీఎస్సీపై జగన్ ప్రశ్నల వర్షం..
YS Jagan key Press Meet On AP DSC 2026 : ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
- Harish Thanniru
- Published on- September 10, 2026 / 12:35 PM IST
YS Jagan key Press Meet On AP DSC 2026
YS Jagan key Press Meet On AP DSC 2026 : ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీకి సంబంధించిన తన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ నుంచి సమాధానం రావడం లేదని విమర్శించారు. ప్రస్తుతం బయటకు వస్తున్న కేసు స్టడీలను చూస్తుంటే విస్తుపోయే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.
Also Read : Donald Trump : వార్నీ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఫాలో అవుతున్న ట్రంప్..?
గురువారం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్పీపై పెద్దెత్తున అక్రమాలు జరిగాయని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులను పరీక్ష లేకుండానే అక్రమంగా భర్తీ చేశారని విమర్శించారు. ముఖ్యంగా జూడో పోటీలకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. అసలు పోటీలు జరగకపోయినా జరిగినట్టుగా చూపించి, అభ్యర్థులు ప్రతిభ కనబరిచినట్టుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని ఆరోపించారు.
జూడో పోటీలు నిర్వహించలేదని సంబంధిత జూడో అసోసియేషన్ ప్రతినిధులే చెబుతున్నారన్న జగన్.. అయినప్పటికీ ఆ పోటీల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయని ప్రశ్నించారు. ఇలాంటి సర్టిఫికెట్ల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆరోపించారు. ఫేక్ సర్టిఫికెట్లకు ప్రభుత్వ పెద్దలే ధ్రువీకరణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించారని జగన్ విమర్శించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) వ్యవస్థను ఉపయోగించి కొందరికి నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు ఇచ్చారంటూ జగన్ ప్రధాన ఆరోపణలు చేశారు.
విశాఖపట్నంలో ఓ కుటుంబంతో మాట్లాడుకుని ఉద్యోగాలు ఇచ్చారంటూ జగన్ మరో ఆరోపణ చేశారు. ఏయే ప్రాంతాల్లో ఈవెంట్లు జరిగినట్లు రికార్డులు సృష్టించారో గుర్తించి, అందుకు అనుగుణంగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేశారని ఆరోపించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తే ఇది సాధారణ అక్రమం కాదని, పెద్ద స్థాయిలో జరిగిన వ్యవహారమని ఆయన విమర్శించారు.
ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు.? మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్‌ర్యాంకర్ పేరు ఎందుకు లేదు.? సెకండ్ లిస్ట్‌లో అతని పేరు ఎందుకు మాయమైంది?. అతని డీఎస్సీ లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారు. ఎందుకు అతన్ని వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు.. కోర్టుకు ఆ ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు?. స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నంలోనే ఇదంతా చేశారని జగన్ ఆరోపించారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ.. పర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారని ప్రశ్నించిన జగన్.. ఇక్కడే డీఎస్సీ స్కామ్‌కు ద్వారాలు తెరిచారని అన్నారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ బుల్డోజ్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ జగన్ సంచలన కామెంట్స్ చేశారు.
